చికుల్లో పవన్ కళ్యాణ్..? చంద్రబాబుపైనే భారం వేసిన జనసేన

ఏపీలో ఓ కీలక అంశంలో అటవీశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది. అయితే ఇందులో ముందునుయ్యి, వెనుక గొయ్యిలా పరిస్ధితి ఉంది.


ఈ వ్యవహారంలో దూకుడుగా వెళ్తే జనం నుంచి ఇబ్బందులు తప్పవు. అలాగే సైలెంట్ గా ఉంటే సుప్రీంకోర్టు ఊరుకోదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబుపైనే భారం వేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కొల్లేరు సరస్సు కొన్నేళ్లుగా తీవ్రంగా కబ్జాలకు గురైంది. దీంతో కొల్లేరులోకి వెళ్లాల్సిన జల ప్రవాహాలకు ఆటంకం కలిగి వరదలు వచ్చే పరిస్ధితి ఎదురైంది. దీంతో 2006లో అప్పటి సీఎం వైఎస్సార్ సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు. వేల సంఖ్యలో చేపల చెరువు గట్లను నాటు బాంబులతో పేల్చేశారు. అయితే ఆ తర్వాత ఈ ఆపరేషన్ నెమ్మదించింది. కానీ సుప్రీంకోర్టులో తాజాగా ఓ పిటిషన్ రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. 3 నెలల్లో ఆక్రమణలు తొలగిస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం క్షేత్రస్దాయిలో మాత్రం వేగంగా అడుగులు వేయలేకపోతోంది.

ఇలాంటి సమయంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా చిక్కుల్లో పడ్డారు. కొల్లేరు ఆపరేషన్ పై ముందుకెళ్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అలాగని సైలెంట్ గా ఉండిపోతే సుప్రీంకోర్టు ఊరుకునే పరిస్ధితి లేదు. దీంతో ఈ భారం మొత్తాన్ని సీఎం చంద్రబాబుపైనే వేస్తూ ఆయన అనుభవంతో నిర్ణయం తీసుకుంటారంటూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో అప్పట్లో కొల్లేరు ఆపరేషన్ ను విజయవంతంగా ఓ దశ వరకూ తీసుకెళ్లిన మాజీ సీఎం వైఎస్సార్ పైనా విమర్శలకు దిగింది.

కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న సమస్యాత్మక పరిస్థితులకు మూల కారణాలు అన్వేషించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న అన్ని పరిణామాల్ని తెలుసుకోవాలని తెలిపింది. సామాజిక పరిస్ధితులు పట్టించుకోకుండా కోర్టులు, ప్రభుత్వాలు అప్పట్లో వ్యవహరించాయని చెప్పుకొచ్చింది.

కొల్లేరు సమస్య సంక్లిష్టం కావడంలో వైఎస్సార్ నుంచి వైసీపీ వరకూ చూస్తే ప్రతి దశలో వారి రాజకీయ అవసరాలకు ఆడిన ఆటలే కారణంగా కనిపిస్తాయని జనసేన చెబుతోంది. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సిద్ధాంతం కలిగిన జనసేన పార్టీ కొల్లేరువాసులతో వివిధ సందర్భాల్లో ఈ సమస్యపై చర్చించినట్లు తెలిపింది.పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఈ అంశంపై సమతుల్యమైన పరిష్కారం దిశగా అధికారులతో, నిపుణులతో, ఆ ప్రాంతవాసులతో చర్చిస్తున్నట్లు తెలిపింది.

ఒడిశాలోని చిల్కా సరస్సు విషయంలోనూ ఇటువంటి చిక్కులే ఎదురైతే అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధానాలను సైతం అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారని వెల్లడించింది. అయితే ఎన్నో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉందని ఆయన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొల్లేరు సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందని తెలిపింది. కొల్లేరుపై ఆధారపడ్డవారి జీవనోపాధులను రక్షిస్తూనే, అక్కడి పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందని వెల్లడించింది.