కమ్మటి “జొన్న దోసెలు” – కేవలం రెండు పదార్థాలతోనే రెడీ

మారుతున్న ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వంటి కారణాల వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వెయిట్​లాస్​ కోసం ప్రయత్నించేవారు కఠినమైన డైట్​ పాటిస్తుంటారు. ఇలాంటి వారు జొన్నదోసెలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. ఈ స్టోరీలో చెప్పిన విధంగా దోసెలు చేస్తే కేవలం రెండు పదార్థాలు సరిపోతాయి. అలాగే ఈ జొన్న దోసెలు ఎంతో మృదువుగా వస్తాయి. షుగర్​, బీపీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా వీటిని తింటే మంచి ఫలితం ఉండొచ్చు. మరి ఈజీగా ఈ జొన్న దోసెలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన పదార్థాలు :

అటుకులు – పావుకప్పు
జొన్నలు – కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – కొంచెం

తయారీ విధానం :

ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్నలు, అటుకులు తీసుకోండి. వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టుకోండి. మీరు ఈ జొన్న దోసెలు ఉదయం బ్రేక్​ఫాస్ట్​లోకి చేసుకోవాలనుకుంటే రాత్రంతా నానబెట్టుకోండి. ఒకవేళ నైట్​ డిన్నర్​లోకి దోసెలు వేసుకోవాలనుకుంటే పగలు జొన్నలను నానబెట్టుకోండి.
ఇలా నైట్​ మొత్తం నానబెట్టుకున్న జొన్నలు, అటుకులను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
దోసెల పిండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, వాటర్​ వేసుకుని పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా, పల్చగా కాకుండా దోసెల పిండిలా ఉండాలని గుర్తుంచుకోండి.
ఈ పిండిని ప్రిపేర్ చేసుకొని అరగంటపాటు పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్​పై దోసె పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. అది హీట్ అయ్యాక కాస్త ఆయిల్​ అప్లై చేసి గరిటెతో కొద్దిగా పిండిని తీసుకొని వీలైనంత పలుచగా దోసెలా వేసుకోవాలి.
స్టవ్ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి దోసెను కాసేపు కాల్చుకోండి. తర్వాత దోసె పైన అంచుల వెంబడి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోండి.
అయితే, ఈ జొన్న దోసెలు ఎర్రగా క్రిస్పీగా రావు. కాబట్టి, దోసె కాస్త రంగు మారగానే ఒక ప్లేట్లోకి తీసుకోండి. వెయిట్​ లాస్​ కోసం ప్రయత్నించేవారు నూనె వేసుకోకుండా కూడా దోసెలు కాల్చుకోవచ్చు.
అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే హెల్దీ జొన్న దోసెలు రెడీ!
బరువు తగ్గాలని ప్రయత్నించే వారు తరచూ జొన్న దోసెలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. జొన్న దోసెలు టమోటా, అల్లం చట్నీతో తింటే రుచి చాలా బాగుంటాయి.