ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంపైన బాగా ఫోకస్ చేస్తుంది. ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్న ప్రభుత్వం, సందర్భం ఏదైనా సరే వేడుకలతో ఇతర రాష్ట్రాల, విదేశాల ప్రజలకు స్వాగతం పలుకుతుంది.
విజయవాడ ఉత్సవ్, విశాఖ ఉత్సవ్ అంటూ అవకాశాన్ని బట్టి ఉత్సవాలు జరుపుతోంది. ఏపీలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది.
ఏపీలో హౌస్ బోట్లు
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టూరిజంను మరింత మెరుగుపరచడం కోసం కేరళ తరహాలో హౌస్ బోట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కృష్ణ, గోదావరి వంటి నదులు ప్రవహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అనేక పర్యాటక ప్రాంతాలలో నదులు, రిజర్వాయర్లలో హౌస్ బోట్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీని కోసం ప్రైవేట్ ఆపరేటర్లు ఆసక్తి చూపుతుండగా వారికి అనుమతులను కూడా ఇచ్చింది.
మొత్తం 8 పర్యాటక ప్రాంతాలలో హౌస్ బోట్లు
కేరళ తరహాలో ఈ హౌస్ బోట్లు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి సరస్వతి ఘాట్, పుష్కర ఘాట్, సూర్యలంక భవాని ద్వీపం, కడప గండికోట, అనకాపల్లి జిల్లా కొండకాకర్ల సరస్సు, విశాఖ గంభీరం, అల్లూరి జిల్లా తాజంగి రిజర్వాయర్లలో హౌస్ హలో బోట్లను నిర్వహించడానికి అనుమతులు లభించాయి.
విజయవాడలో ప్రారంభం అయిన హౌస్ బోట్లు
మొత్తం పది కోట్ల రూపాయల పెట్టుబడులతో పలు ప్రైవేట్ సంస్థలు ఇక్కడ సింగిల్ మరియు డబల్ బెడ్ రూమ్ హౌస్ బోట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల విజయవాడలోని భవాని ద్వీపంలో హౌస్ బోట్లను ప్రారంభించగా, అవి ఇంకా బుకింగ్ లు మొదలు కాలేదు. విజయవాడలో రెండు హౌస్ బోట్ లతోపాటు, రొమాంటిక్ ఫ్లోట్ మరియు డైన్ బోట్లను కూడా ఏర్పాటు చేశారు.
హౌస్ బోట్లతో పాటు మౌలిక సదుపాయాల కల్పన
ఒక్కో హౌస్ బోట్ లో ఆరుగురు హాయిగా విహరించేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ హౌస్ బోట్ లకు కావలసిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. పెళ్లిరోజులు, పుట్టినరోజులు, ఫ్యామిలీ లంచ్ మరియు డిన్నర్లు జరుపుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన డైన్ బోట్లు, రొమాంటిక్ ఫ్లోట్ లు ఉపయోగపడతాయి. హౌస్ బోట్లు ఏర్పాటు చేసిన ప్రతిచోట కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేసి, అధికారులు బోట్లను నిరంతరం తనిఖీ నిర్వహిస్తారు.
హౌస్ బోట్ల కోసం కేరళ అవసరం లేదు ఏపీ చాలు
వరద సమయంలో పర్యాటకులను అనుమతించకుండా కూడా పక్కగా ప్లాన్స్ ను రూపొందిస్తున్నారు. ఏది ఏమైనా ఇకపైన హౌస్ బోట్లలో విహరించాలి అనుకుంటే కేరళ వెళ్లాల్సిన అవసరం లేదు, ఏపీలోనే అటువంటి సదుపాయాలను కల్పిస్తుంది చంద్రబాబు సర్కార్.






























