ఏపీ వాలంటీర్లపై త్వరలో కీలక నిర్ణయం..?

www.mannamweb.com


ఏపీలో ఎన్డీయే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది. అయినా కీలకమైన వాలంటీర్ల వ్యవస్ధ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఓ వెలుగు వెలిగి ఇంకా రాజీనామాలు చేయకుండా ఉన్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వీరిని కొనసాగించడంతో పాటు జీతం రెట్టింపు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే దీనిపై మల్లగుల్లాలు పడుతున్న కూటమి సర్కార్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో మొత్తం 2.67 లక్షల వాలంటీర్లను వైసీపీ సర్కార్ నియమించగా.. అందులో లక్ష మందికి పైగా ఇప్పటికే రాజీనామాలు చేసేశారు. దీంతో మిగిలిన లక్షన్నర మంది విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుుకోవాల్సి ఉంది. వీరిలో చాలా మంది ఇప్పటికే స్ధానికంగా కొత్త ఎమ్మెల్యేలను కలిసి తమ బాధలు విన్నవించారు. దీంతో గతంలో బలవంతంగా రాజీనామాలు చేసిన వారితో పాటు వీరిపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరిని కొనసాగించేందుకు కొన్ని మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే వారికి విద్యార్హతతో పాటు మూడేళ్ల కాలపరిమితి విధించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించడంతో పాటు వారికి ఈ మూడేళ్లలో వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి, తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. వీటిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.