IT Refund: రీఫండ్లపై పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం కీలక హెచ్చరిక
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం కీలక హెచ్చరికలు చేసింది. ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్‌లో బోగస్ ఖర్చులను చూపొద్దని, ఆదాయం తక్కువగా చూపవద్దని, పన్ను కోతలను ఎక్కువగా పేర్కొనవద్దని సూచించింది.
అది శిక్షార్హమైన నేరమని, అలాంటి చర్యల వల్ల రీఫండ్లు ఆలస్యమవుతాయని స్పష్టం చేసింది. అసెస్‌మెంట్ ఏడాది 2024-25కు సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్‌కి జూలై 31తో గడువు ముగియనుంది. ఆదాయపు పన్ను శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకారం, జూలై 26 నాటికి ఐదు కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఫైలింగ్‌లో అభ్యంతరాలు ఉంటే ఐటీఆర్ పోర్టల్‌లో స్పందనను తెలియజేయాలని, అందుకు పెండింగ్ యాక్షన్ వర్క్‌లిస్ట్ సెక్షన్‌లో ఆప్షన్ ఉంటుందని ఐటీ విభాగం తెలిపింది.
రీఫండ్లకు సంబంధించి గడువును 30 రోజుల నుంచి 60 రోజులకు పొడిగిస్తామని తాజాగా కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కానీ ఆలస్యమయ్యే సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయని సీబీడీటీ ఛైర్మన్ రవి అగర్వాల్ చెప్పారు. 30 రోజుల్లోనే ఐటీఆర్‌లను సమీక్షించే ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అవసరాన్ని బట్టి అదనపు సమాచారం కావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే రీఫండ్లు ఆలస్యమవుతాయని పేర్కొన్నారు. వెసులుబాటు కోసం మాత్రమే ప్రభుత్వం 60 రోజులకు పొడిగించారన్నారు. ఈ క్రమంలోనే రీఫండ్లు సకాలంలో అందేందుకు తప్పొప్పులు, పొరపాట్లు లేని రిటర్నులను సమర్పించాలని ఐటీ విభాగం సూచించింది