ముఖ్యమంత్రి రేవంత్ పార్టీలో పదవుల పంపకం పైన కసరత్తు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో మెజార్టీ లోక్ సభ సీట్లు గెలవటం ఇప్పుడు రేవంత్ కు సవాల్ గా మారుతోంది.
దీంతో, మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ అనుమతి కోరారు. తన కేబినెట్ లోకి ప్రొఫెసర్ కోదండరామ్ ను తీసుకోవాలని రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. దీని పైన హైకమాండ్ తుది ఆమోదం రావాల్సి ఉంది.
రేవంత్ కసరత్తు : రేవంత్ రెడ్డి పాలనలో..పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ముఖ్య నిర్ణయాలకు హైకమాండ్ అనుమతితోనే అమలు చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్ పెట్టారు. అందులో హోం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.
కోదండరాం కు ఛాన్స్ : ఈ నెలాఖరులోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీలో ప్రచారం సాగుతోంది. నామినేటెడ్ పోస్టులను కొన్నింటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం. ఇక మంత్రి వర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరాం కు అవకాశం ఇవ్వాలనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఒకటి కోదండరాం కు ఖరారు అయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. దీంతో, కోదండరాం కు మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించటం ద్వారా ప్రొఫెసర గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
త్వరలో విస్తరణ : కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా బీఆర్ఎస్ పైన నైతికంగా పై చేయి సాధించవచ్చనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక, మిగిలిన అయిదు మంత్రి పదవుల్లో షబ్బీర్ అలీకి ఖాయమని చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకం తో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావ్ కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్ పోటీలో ఉన్నా..షబ్బీర్ అలీకి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కి అవకాశాలు సన్నగిల్లుతాయి. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికి అప్పగిస్తారనేది తేలాల్సి ఉంది.