మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడి జ్ఞాపకార్థం రూ.8 కోట్లు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలకు కార్పొరేట్ స్థాయిలో భవనాలు నిర్మించారు. నల్లగొండ పట్టణ శివారులోని బొట్టుగూడలో దీన్ని నిర్మిచారు.
ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ. 8 కోట్ల భారీ వ్యయంతో ఈ పాఠశాలను పునర్నిర్మించారు. ప్రభుత్వ పాఠశాల అంటే ఉండే పాత భావనను తుడిచేస్తూ, సెంట్రల్ ఏసీ, అత్యాధునిక డిజిటల్ తరగతి గదులు, ప్రయోగశాలలు, విశాలమైన ఆటస్థలంతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా నిర్మించారు.
ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు ప్రతీక్ రెడ్డిని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 2011, డిసెంబర్ 20న ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పట్లో ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతీక్, తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుండి వస్తుండగా పటాన్‌చెరు సమీపంలోని కొల్లూరు వద్ద వారి కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో, కేవలం 19 ఏళ్ల ప్రాయంలోనే ప్రతీక్ ప్రాణాలు కోల్పోయారు. తన కుమారుడు భౌతికంగా లేకపోయినా, అతని పేరున వేలాది మంది పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాలని ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇలాంటి సాంకేతిక వసతులు కల్పించడం ద్వారా పేద పిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో పోటీ ప్రపంచంలో రాణించగలరని మంత్రి ఆకాంక్షించారు. ఒక తండ్రిగా తన కుమారుడికి ఇచ్చే అతిపెద్ద నివాళి ఇది అని, ఈ పాఠశాల ద్వారా చదువుకుని ప్రయోజకులయ్యే ప్రతి విద్యార్థిలో తన కుమారుడిని చూసుకుంటానని మంత్రి వెంకటరెడ్డి చెబుతున్నారు.

































