అమరావతి క్యాంటం వ్యాలీలో ఉద్యోగం కావాలా ? 50వేల మందికి ఆఫర్.

పీ రాజధాని అమరావతిలో వచ్చే ఏడాది క్వాంటం వ్యాలీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.. అందులో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్రంలో విద్యార్దుల్ని సన్నద్ధం చేసేందుకు మరో భారీ కార్యక్రమం సిద్దం చేస్తోంది.


ఇందులో భాగంగా 50 వేల మంది విద్యార్దులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. భవిష్యత్తులో క్వాంటం వ్యాలీలో ఉద్యోగాలు పొందేందుకు వీలుగా ఎంపిక చేసిన 50 వేల మందికి శిక్షణ ఇవ్వబోతోంది. దీని పూర్తి వివరాలను వెల్లడించింది.

అమరావతి క్వాంటం మిషన్ లో భాగంగా రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో ప్రస్తుతం డిగ్రీలు చదువుతున్న విద్యార్దుల్ని ఎంపిక చేసి వారికి ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వబోతోంది. ఇందులో రాష్ట్ర విద్యార్దులకు నామమాత్రపు ఫీజుల్ని పెట్టింది. అలాగే ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు కూడా కొంచెం ఎక్కువ ఫీజుతో ఈ క్వాంటం టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ శిక్షణను బ్యాచ్ ల వారీగా ఇవ్వబోతోంది. ఇలా తొలి బ్యాచ్ డిసెంబర్ 8న ప్రారంభం కాబోతోంది.

అమెరికాకు చెందిన వైజర్ (WiSER), హైదరాబాద్‌లోని క్యూబిటెక్‌ స్మార్ట్‌ సొల్యూషన్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఈ మేరకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వచ్చే నాలుగేళ్ల పాటు ఈ కోర్సులు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు, డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్ చదువుతున్నవారు, అలాగే ఉద్యోగులు, అధ్యాపకులకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. శిక్షణ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. ఈ శిక్షణ రెండు దశల్లో ఉంటుంది.

తొలిదశలో ఫౌండేషన్ కోర్సుగా నాలుగు వారాల ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఏపీ విద్యార్థులకు ఫీజు కేవలం ₹500 మాత్రమే. ఇతర రాష్ట్రాల వారికి, ఉద్యోగులకు వేర్వేరు ఫీజులు నిర్ణయించారు. ఇందులో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాథమిక అంశాలు, వివిధ రంగాలలో దాని అనువర్తనాలపై అవగాహన కల్పిస్తారు. రెండో దశలో అడ్వాన్స్‌డ్ కోర్సు లో తొలి దశలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 3వేల మందికి ఈ ఆరు వారాల అడ్వాన్స్‌డ్ కోర్సులో పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఈ దశలో అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్ రూపొందించడంపై దృష్టి సారిస్తారు. రెండో దశలో టాప్‌గా నిలిచిన 100 మందికి ‘యంగ్‌ రీసెర్చర్స్‌ స్కాలర్‌షిప్‌’ ఇస్తారు. దీంతో పాటు వైజర్ సంస్థ నిర్వహించే క్వాంటమ్ సమ్మర్ స్కూల్‌లో ఉచిత ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలాగే 300 నుంచి 400 మంది విద్యార్థులకు వివిధ కంపెనీలలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తారు.

ఈ కోర్సులో ఎంఐటీ, ప్రిన్స్‌టన్, స్టాన్‌ఫోర్డ్‌ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రొఫెసర్ల లెక్చర్లు, అలాగే నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ విలియం ఫిలిప్స్‌ ఉపన్యాసాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. గూగుల్, ఐయాన్‌క్యూ వంటి సంస్థలకు చెందిన క్వాంటమ్ ల్యాబ్‌ల వర్చువల్ టూర్లు, పరిశ్రమల నిపుణులతో ప్యానల్ డిస్కషన్లు ఈ శిక్షణకు అంతర్జాతీయ స్థాయిని కల్పిస్తున్నాయి. ఈ కోర్సులో చేరాలనుకునేవారు https://learn.qubitech.io వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.