అదనంగా తయారీకి తితిదే చర్యలు
ఈనాడు, తిరుపతి: శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు తితిదే చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియామకానికి సిద్ధమవుతోంది.
తితిదే ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల పెద్ద లడ్డూలు (కల్యాణం లడ్డూ), 3,500 వడలు తయారు చేస్తోంది. తిరుమలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. సాధారణంగా దర్శనం చేసుకున్న భక్తులకు ఒక చిన్న లడ్డూను ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు సరాసరి 70 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఉచిత లడ్డూలే 70 వేలు ఇవ్వాలి. వీటితోపాటు భక్తులు తమ బంధువులు, చుట్టుపక్కల ఉన్నవారికి శ్రీవారి ప్రసాదాన్ని ఇచ్చేందుకు అదనంగా మరికొన్ని కొనుగోలు చేస్తుంటారు.
ప్రత్యేక రోజుల్లో డిమాండ్ ఉండటంతో..
సాధారణ రోజుల్లో ఇబ్బందులు లేకున్నా.. వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో డిమాండ్ అధికంగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 50వేల చిన్న లడ్డూలు, 4వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని తితిదే నిర్ణయించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీవైష్ణవులతోపాటు మరో పది మంది శ్రీవైష్ణవులు కానివారిని నియమించనున్నారు.