Inter New Course : ఇంటర్‌ విద్యార్థుల కోసం ‘MBiPC’ కొత్త కోర్సు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం విద్యార్థుల కోసం అద్భుతమైన కోర్సు ఒకటి తీసుకొచ్చింది. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు తాము ఇంజినీర్లు లేదా మెడిసిన్ రెండింటిలో ఏది చదవాలో ఎంచుకోవచ్చు.


ఈ కోర్సు చేసిన చేసిన విద్యార్థులు ఇంటర్ తర్వాత తమకు ఏ సబ్జెక్టులో బాగా పట్టు ఉందో దానికి సంబంధించి మెడిసిన్ లేదా ఇంజినీరింగ్ రెండింటిలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. గతంలో అయితే ఇంటర్‌లో ఎంపీసీ చదివిన వాళ్లు మాత్రమే ఇంజినీరింగ్ చేసే అవకాశం ఉంది.

అదే బైపీసీలో చదివితే మెడిసిన్ చదివేవారు. కానీ, ఇకపై అలా కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండు కోర్సులను కలిపి ఒకటిగా చేసింది. ఎంబైపీసీ పేరుతో కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇకపై ఈ కోర్సు చేసిన విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్ ఆధారంగా ఇంజినీరింగ్, మెడిసిన్ ఏదైనా ఒకటి సులభంగా ఎంచుకుని చదువుకోవచ్చు అనమాట. విద్యార్థులు ఎవరైతే ఎంబైపీసీ కోర్సు తీసుకుంటారో వారు ఇంజినీరింగ్, మెడిసిన్ రెండు పరీక్షలు రాసుకోవచ్చు. అందులో మంచి ర్యాంకు వస్తే ఆయా విభాగాల్లో హాయిగా చదువుకోవచ్చు.

సబ్జెక్టుల్లో కూడా మార్పులు :
ఇంటర్ విద్యలో పలు సంస్కరణలను తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఎంబైపీసీ కోర్సును 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది. గత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ రెండు పేపర్లు ఉండగా వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 100 మార్కులకు మ్యాథ్స్ సింగిల్ పేపర్ ఉంటుంది.

రెండు మార్కుల ప్రశ్నలను ఎత్తేసి ఆ స్థానంలో ఒక మార్కు ప్రశ్నలు ఉండనున్నాయి. పిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ప్రస్తుతం ఒక్కో సబ్జెక్టుకు 60 మార్కుల ఉండగా ఇప్పుడు 85 మార్కులకు పెంచింది. మిగతా 15 మార్కులను ప్రాక్టికల్స్ కోసం కేటాయించారు. ప్రాక్టికల్స్‌లో ఒక మార్కు ప్రశ్నలే ఉంటాయి.

జువాలజీ, బోటనీ సబ్జెక్టులను రెండింటిని కలిపి బయాలజీగా ఒకే సబ్జెక్టుతో 85 మార్కులు ఉంటుంది. అంటే.. బోటనీ 43 మార్కులు, 42 మార్కులకు జువాలజీకి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 15 మార్కులు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలను ఒకేసారి చివరి ఏడాదిలోనే నిర్వహిస్తారు.

విద్యార్థులు 6 సబ్జెక్టులతో ఎంబైపీసీ చదువుకోవచ్చు. ఇందులో ఒకటి లాంగ్వేజీ సబ్జెకట్టుగా ఇంగ్లీష్ తప్పనిసరి. ఆ తర్వాత మీకు ఇష్టమైన లాంగ్వేజీ సబ్జెక్టు ఎంచుకోవచ్చు. ఎంపీసీ వాళ్లు సెకండ్ లాంగ్వేజీగా హిందీ, సంస్కృతం, తెలుగు ఉర్దూ కాకుండా బయాలజీ తీసుకుంటే ఎంబైపీసీ చదవచ్చు. లాంగ్వేజీలు, సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో 24 సబ్జెక్టుల్లో ఏదైనా విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఈసారి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చికి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహించనున్నారు.