ఊబకాయం (Obesity), మధుమేహంతో (Type 2 diabetes) బాధపడేవారికి ఊరట కలిగించే వార్త. వీటికి సంబంధించి భారత్‌లో తొలిసారిగా ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎలీ లిల్లీ సంస్థ వెల్లడించింది. మౌంజారో (Mounjaro) బ్రాండ్ పేరుతో మార్కెట్లో విడుదల చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (CDSCO) అనుమతి లభించిందని పేర్కొంది. మౌంజారో సింగిల్ డోసు బాటిల్‌లో లభిస్తుంది. 2.5మి.గ్రా ధర రూ.3500 కాగా.. 5 మి.గ్రా రూ.4375 ఉన్నట్లు తెలుస్తోంది.
మధుమేహం, బరువు తగ్గించే (Weight Loss) చికిత్సలో ఉపయోగించే ఈ మౌంజారో ఔషధం టిర్జెపటైడ్ (tirzepatide) పేరుతో బ్రిటన్, యూరప్ దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. అమెరికాలో మాత్రం జెఫ్‌బౌండ్ పేరుతో విక్రయిస్తున్నారు. కాగా భారత్‌లో మాత్రం ఇదే మొట్టమొదటిది. జీఐపీ (గ్లూకోజ్ ఆధారిత ఇన్సులినోట్రోపిక్ పోలిపెప్టైడ్), జీఎల్‌పీ-1 (గ్లూకాగాన్ మాదిరి పెప్టైడ్) హార్మోన్ గ్రాహకాలను ఉత్తేజపరచడం ద్వారా మౌంజారో పనిచేస్తుందని నిపుణులు వెల్లడించారు.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో.. ఊబకాయం, అధికబరువు, టైప్-2 మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం మధుమేహం, ఊబకాయం సమస్యలు ఎదర్కొంటున్న వారి సంఖ్య దేశంలో దాదాపు 10కోట్లు ఉన్నట్లు అంచనా. అధిక బరువుతో మధుమేహం ముప్పు పొంచివుండగా.. హైపర్‌టెన్షన్, హృద్రోగ సమస్యలు, నిద్రలేమి వంటి దాదాపు 200 రకాల ఆరోగ్య సమస్యలతో ఇవి ముడిపడి ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.