ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలానే హైదరాబాద్‌ను విశ్వ నగరంగా అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ గ్లోబల్ వేదిక సాక్షిగా.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల కలలు, ఆకాంక్షల సాకారం చేసేందుకు ‘తెలంగాణ రైజింగ్ -2047’ విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో భాగంగా దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని భౌగోళికంగా మాత్రమే కాకుండా.. అభివృద్ధి ప్రామాణికంగా 3 విభిన్న జోన్లుగా (క్యూర్, ప్యూర్, రేర్) ఈ విజన్ డాక్యుమెంట్ విభజించింది.
గ్లోబల్ సమ్మిట్ వేదికగా మొత్తం 83 పేజీల డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రజల ముందు ఉంచింది. ఇప్పటికే మెరుగైన మౌలిక సదుపాయాలతో.. ప్రపంచ స్థాయి ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఇకపై.. ‘నెట్-జీరో సిటీ’గా మార్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రేవంత్ సర్కార్.. గ్రామాల నుంచి నగరాల వరకు.. ఆలయం నుంచి అడవి వరకు.. ప్రతి దాన్ని అనుసంధానిస్తూ.. టూరిజం సర్క్యూట్లకు శ్రీకారం చుట్టబోతున్నది. దీని ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక కళలు, సంస్కృతిని.. విశ్వ వ్యాప్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ సర్కార్ అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంది.
ఈక్రమంలో హైదరాబాద్‌ను దక్షిణ ఆసియాలోనే ‘నైట్ టైమ్ క్యాపిటల్’గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ఆర్టీసీ, మెట్రో రైలు వంటి వాటిని అర్థరాత్రి 2 గంటల వరకు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. దీనిలో భాగంగా మాదాపూర్, ట్యాంక్‌బండ్, ఓల్డ్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, విమానాశ్రయ ప్రాంతాలను నైట్ జోన్లుగా మార్చనున్నారు.
చార్మినార్ నుంచి గోల్కొండ వరకు వయా ట్యాంక్ బండ్ మీదుగా.. ‘ హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ మైల్’ పేరుతో రాత్రి పూట నిర్వహించే బజార్లు, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అలానే తెలంగాణవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 27 ప్రత్యేక పర్యాటక ప్రదేశాలను గుర్తించారు. పర్యాటకుల సౌకర్యార్థం.. హోటల్ బుకింగ్స్, టికెట్లు, ప్రయాణం అన్నీ ఒకే కార్డుతో జరిగేలా ‘తెలంగాణ పాస్’ (యూనిఫైడ్ డిజిటల్ పాస్) తీసుకురానున్నారు.
వీటితో పాటు ఆకాశం నుంచి సోమశిల, రామప్ప, నాగార్జునసాగర్, కాళేశ్వరం అందాలను చూసేందుకు హెలికాప్టర్ రూట్లను ఏర్పాటు చేయనున్నారు. భువనగిరిని.. ‘రాక్ క్లైంబింగ్ డెస్టినేషన్’గా.. అమ్రాబాద్, కవ్వాల్ అడవుల్లో ఎకో ట్రయల్స్ ఏర్పాటు చేస్తారు. టైగర్ రిజర్వ్ జోన్లలోనూ రిసార్టులు రానున్నాయి.


































