ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఏపీసీసీ చీఫ్ షర్మిల వర్సెస్ వైసీపీగా రాజకీయం మారుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల సోదరుడు, సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
షర్మిలకు ధీటుగా వైసీపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డ అన్నారు.. ఇప్పుడు ఆమె మరో కొత్త అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏమి చేయలేక గాలికొదిలేశారు.. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు.
నిజమైన రాజన్న బిడ్డ సీఎం జగన్ మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కేవలం వైఎస్ ఆస్తుల కోసమే రోడ్డు ఎక్కారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అని సెటైర్ వేశారు. ఇదిలా ఉంటే, ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో పర్యటించిన షర్మిలపై రోజాపై నిప్పులు చెరిగారు. రోజా నగరిలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. నగరిలో ఏ పని చేయాలన్న మంత్రి రోజాకు కమీషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈ క్రమంలో షర్మిల వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు..