నిద్రలో కండరం పట్టేస్తుందా? ఇలా చేస్తే వెంటనే సెట్ అయిపోతుంది

www.mannamweb.com


గాఢ నిద్రలోకి జారుకుంటారో లేదో కొందరికి కాళ్లలో నరాలు లాగేసినట్లు అవుతాయి. నరం పట్టేసుకుంటుంది. కండరం పట్టేసినట్లు అనిపిస్తుంది. దీంతో నొప్పి విపరీతంగా ఉంటుంది.

కొన్ని క్షణాల పాటూ ఉక్కిరిబిక్కిర అవుతారు. ఈ సమస్యను ఎప్పుడోసారి ఎదుర్కునే ఉంటారు.

కండరాలు పట్టేయడం:

అమెరికన్ ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రకారం, రాత్రిపూట కాలి నరాలు, కండరాలు పట్టేసే సమస్య 60 శాతం మందికి పైగా వయసులో పెద్ద వారిని ప్రభావితం చేస్తుంది. కండరాల తిమ్మిరి సమస్యను చార్లీ హార్స్ అని కూడా పిలుస్తారు. కాలులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కండరాలు అకస్మాత్తుగా బిగుసుకుపోయినప్పుడు ఈ సమస్య ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా చీలమండలం నుండి పాదం వెనుక భాగంలో మోకాలి వరకు ఉండే కండరంలో ఎక్కువగా నొప్పి ఉంటుంది.

చాలాసార్లు, కాలు తిమ్మిరి సమస్య 10 నిమిషాల్లోనే దానికదే తగ్గిపోతుంది. కానీ ఈ సమయంలో తీవ్రమైన నొప్పి మాత్రం ఉంటుంది. కొందరు ఆ నొప్పిని తట్టుకోలేరు కూడా. కొందరిలో ఆ నొప్పి మరుసటి రోజు వరకు ఉంటుంది. తరచుగా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే దానికి కారణాలు, చికిత్సను తెలుసుకోవడానికి వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అలాగే మీకు తక్షణ ఉపశమనం ఇచ్చే కొన్ని మార్గాలు చూడండి.

కారణాలు:

ఈ సమస్యకు ఖచ్చితమైన కారణం ఇదీ అని చెప్పలేం. కానీ సాధారణంగా వైద్యులు చెప్పే కొన్ని కారణాలు తెల్సుకుందాం.

డీ హైడ్రేషన్:

కొన్నిసార్లు డీహైడ్రేషన్ కూడా కాళ్లలో నరం పట్టేయడం, తిమ్మిరికి కారణమవుతుంది. శరీరానికి కావాల్సినంత నీరు అందనప్పుడు కండరాలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన నీరు లభించదు. ఫలితంగా కండరాలు సరిగా పనిచేయలేక తిమ్మిర్లు మొదలవుతాయి. కాబట్టి వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగే ప్రయత్నం చేయండి.

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత:

శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కూడా కాలు తిమ్మిరికి కారణమవుతుంది. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు సోడియం వంటి ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యత కండరాల పనితీరును ప్రభావితం చేయడం ద్వారా కాలు తిమ్మిరికి కారణమవుతుంది.

కండరాల అలసట

కండరాల అలసట, స్ట్రెచ్చింగ్ కాలు తిమ్మిరికి కారణమవుతుంది.

మందులు

అధిక రక్తపోటుకు చికిత్స చేసేటప్పుడు తీసుకునే మందులు కూడా కాలు తిమ్మిర్లకు కారణమవుతాయి. ఈ మందులు తీసుకోవడం ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది సమస్యను పెంచుతుంది.

ఉపశమనం ఇచ్చే చిట్కాలు:

మసాజ్

నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందడానికి, నొప్పి ఉన్న చోట కండరాన్ని తేలికగా రుద్దుతూ మసాజ్ చేయండి. అలాగే కాలిని ముందుకు వెనక్కి కదిలించండి.

వేడి కాపడం:

నరం పట్టుకోవడం వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి మీరు వేడి టవల్, వేడి నీటి బాటిల్ లేదా హీట్ ప్యాడ్ వాడొచ్చు. వాటితో సమస్య ఉన్న చోట మసాజ్ చేస్తే వెంటనే ఉపశమనం ఉంటుంది. కావాలనుకుంటే వేడినీటి స్నానం కూడా చేయొచ్చు.

నిమ్మరసం:

నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. దీంట్లో రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ కలుపుకుని తాగితే మంచిది. దీంట్లో పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, సోడియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో తగ్గిన ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడతాయి. దీంతో కాళ్ల తిమ్మిరి సమస్యను కూడా నయం చేయడంతో మద్దతిస్తాయి.