అమల్లోకి కొత్త ఆదాయపు పన్ను చట్టం.. అదిరిపోయేలా కొత్త బిల్లు

ఆరు దశాబ్దాల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేస్తూ, పన్ను చట్టాలను సింపుల్(సరళంగా) అర్థం చేసుకోవడానికి వీలుగా రూపొందించడానికి ఉద్దేశించిన ఆదాయపు పన్ను (నం.


2) బిల్లు సోమవారం మధ్యాహ్నం లోక్‌సభను ప్రతిపక్ష చర్చ లేకుండానే క్లియర్ చేసింది. పాత చట్టంలో పదేపదే సవరణలు జరగడం, కాలంచెల్లిన భాష, చట్ట నిర్మాణం సంక్లిష్టంగా మారింత నేపథ్యంలో వాటిని క్రమబద్దీకరించి, ప్రస్తుతం ఉన్న ‘ఆదాయపు పన్ను చట్టం-1961’లోని అంశాలనే స్పష్టంగా, సంక్షిప్తంగా, సరళమైన భాషలో, పునరావృతం కాకుండా రాయించారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా సరళీకరించిన అంశాలే ‘నూతన ఆదాయపు పన్ను బిల్లు’లో ఉంటాయని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. కొత్త బిల్లులో ఆదాయపు పన్నుకు సంబంధించిన ఒక్కో అంశానికి వివిధ నిబంధనలు, షరతులు, వివరణలు ఉండవు. దీర్ఘ వాక్యాలు ఉండవు. న్యూట్రల్ పద్దతిలో రచన ఉంటుంది.

మొదటి ముసాయిదాను అధికార బీజేపీకి చెందిన బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీకి పంపారు. కమిటీ 285 సూచనలు చేసింది. అందులో చాలావాటిని ఆమోదించారని నిర్మలమ్మ చెప్పారు. కొత్త ముసాయిదా దశాబ్దాల నాటి పన్ను నిర్మాణాన్ని మరింత సులభతరం చేస్తుందని, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, ఎంఎస్ఎంఈలు అనవసరమైన వ్యాజ్యాలు వేసే పనిలేకుండా సహాయపడుతుందని అన్నారు.

పాత చట్టంలో 700 సెక్షన్లు ఉండగా, కొత్త బిల్లులో 536కి కుదించారు. పాత చట్టం 823 పేజీలుంటే, కొత్త దాంట్లో 622 పేజీలకు తగ్గించారు. కొత్త బిల్లు నిబంధనల కింద వేతన జీవుల జీతభత్యాలు, మినహాయింపులను కలిపి ఉంచారు. గ్రాట్యుటీ, పింఛన్‌ కమ్యుటేషన్, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా వచ్చే నగదు పరిహారాలను వేతన సెక్షన్‌లోనే కలిపారు. నగదు రూపంలో పన్ను వసూలుకు సంబంధించిన టీడీఎస్, టీసీఎస్‌ నిబంధనలను సరళీకరించారు. రెసిడెంట్, నాన్‌-రెసిడెంట్, ఎనీ పర్సన్‌ అనేలా పన్ను చెల్లింపుదారులను వర్గీకరించారు. నోట్యాక్స్‌ డిడక్షన్‌ నిబంధనలను సులభంగా అర్థమయ్యేలా ఒకటే రిఫరెన్స్‌ పట్టికలో ఉంచారు.

కొత్త బిల్లులో కొన్ని కొత్త అంశాలు:

* పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేసిన సందర్భంలో కూడా వాపసులను క్లెయిమ్ చేయవచ్చు.

* టీడీఎస్ దాఖలు చేయడంలో ఆలస్యమైతే జరిమానాలు ఉండవు.

* ఆదాయపు పన్ను చెల్లించని వారు ముందుగానే ‘నిల్ సర్టిఫికేట్’లను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది స్వదేశీ, ప్రవాస పన్ను చెల్లింపుదారులకూ వర్తిస్తుంది.

* కొంతమంది పన్ను చెల్లింపుదారులకు కమ్యూటెడ్ పెన్షన్, లంప్సమ్ పెన్షన్ చెల్లింపులకు స్పష్టమైన (మునుపటి బిల్లులో ఇది పరోక్షంగా ఉంది) పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ వంటి వాటి నుంచి పెన్షన్లు పొందే వారికి వర్తిస్తుంది.

* గృహ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంపై పన్నును లెక్కించడానికి, సెక్షన్ 21 కింద నిర్ణయించిన విధంగా ప్రామాణిక మినహాయింపు 30 శాతంగా నిర్ణయించారు. ఆస్తిని కొనడానికి, నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి మొదలైన వాటికి అరువు తెచ్చుకున్న మూలధనంపై చెల్లించాల్సిన వడ్డీ కూడా తీసివేస్తారు.

ఎంఎస్ఎంఈ నిర్వచనం

ఎంఎస్ఎంఈ చట్టం ప్రకారం, యంత్రాలపై పెట్టుబడి, వార్షిక టర్నోవర్ ఆధారంగా సూక్ష్మ, చిన్న సంస్థలను వర్గీకరించారు. రూ.1-5 కోట్ల మధ్య పెట్టుబడి ఉంటే సూక్ష్మ సంస్థగా, రూ.5-10 కోట్ల మధ్య టర్నోవర్ ఉంటే చిన్న సంస్థగా వర్గీకరించారు.

కొత్త పన్ను బిల్లులో ఇంకా ఏముంది?

పాత ఆదాయ పన్ను చట్టంలో ‘క్రితం సంవత్సర’ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ‘అసెస్‌మెంట్‌ ఇయర్‌’లో ఆదాయ మదింపు చేసేలా పన్నులు ఉండేవి. ఈ రెండు పదాలు పన్ను చెల్లింపుదారులకు కొంత అయోమయానికి గురిచేసేవి. కొత్త ఆదాయపన్ను బిల్లు ఈ రెండు పదాలను తొలగించి ‘పన్ను సంవత్సరం’ అనే పదాన్ని తెచ్చింది. అది ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు వర్తిస్తుంది. గమనించాల్సిన విషయమేంటంటే.. 2025 ఆదాయపన్ను బిల్లులో కొత్త పన్నులేమీ విధించలేదు. ప్రస్తుతం ఉన్న పన్ను శ్లాబులు, రేట్లలోనూ మార్పులు ఉండవు. నిర్వచనం, నేరం, జరిమానాల్లో మార్పులు చేయలేదు.

ముఖ్యమైన అంశం

కొత్త ఆదాయపు పన్ను బిల్లులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడున్న పన్ను శ్లాబ్‌లు మారవు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.