గుడ్‌న్యూస్‌.. రంగంలోకి దిగనున్న కేంద్రం.. తగ్గనున్న ఉల్లి ధరలు

www.mannamweb.com


దేశంలో ఉల్లి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఖరీదైన ఉల్లిపాయలతో ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రజలకు పెద్ద ఊరట లభించనుంది.

దేశ రాజధాని, చుట్టుపక్కల నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.60కి చేరడంతో కేంద్ర ప్రభుత్వమే రాయితీపై ఉల్లిని విక్రయించాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉల్లిని కిలో రూ.35కి విక్రయించనుంది. మార్కెట్‌లో ధరను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం చర్యలతో దేశ వ్యాప్తంగా ధరలు దిగి రానున్నట్లు తెలుస్తోంది. కేంద్రం బఫర్‌ స్టాక్‌ విడుదల చేయనుండటంతో ధరలు మరంత తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గురువారం నుంచే ఉల్లి విక్రయాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. దీని కోసం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్‌లను ఆదేశించింది. ఈ రెండు ప్రభుత్వ యూనిట్లు సాధారణ ప్రజలకు కిలో ఉల్లిని 35 రూపాయలకే అందజేస్తాయి.

ప్రభుత్వ సంస్థలు NAFED, NCCF రెండూ సాధారణ ప్రజలకు చౌక ధరలకు ఆహార పదార్థాలను అందించడానికి ప్రభుత్వం తరపున పనిచేస్తాయి. ఈ సంస్థలు సెంట్రల్ స్టోర్లు, మొబైల్ వ్యాన్లు, ఇతర మార్గాల ద్వారా ప్రజలకు ఆహార పదార్థాలను రాయితీ ధరలకు అందించడానికి పని చేస్తాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా ఉల్లితో పాటు టమోటా ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, ప్రభుత్వం నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ ద్వారా ప్రజలకు తక్కువ ధరకు టమాటా, ఉల్లిపాయలను అందించింది.

ప్రభుత్వం తక్కువ ధరలో పిండి, పప్పులు, బియ్యం:

ద్రవ్యోల్బణం బారి నుంచి సామాన్య ప్రజలను కాపాడేందుకు ప్రస్తుతం ప్రభుత్వం తక్కువ ధరకే పిండి, పప్పులు, బియ్యాన్ని కూడా విక్రయిస్తోంది. గతేడాది ప్రభుత్వం ‘భారత్‌’ పేరుతో పిండి, పప్పులు, బియ్యాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే, ఇవి కొంతకాలంగా మార్కెట్‌లో అందుబాటులో లేవు. ఎందుకంటే వాటి ధరలను సవరించిన తర్వాత వాటిని మళ్లీ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

ఉల్లి ధర పెరగడానికి కారణాలేంటి?

పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో ధరల నుంచి ఉపశమనం కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. గత వారం రోజుల్లోనే ఉల్లి ధర కిలో రూ.10 పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలే ఉల్లి ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. దీంతో హోల్ సేల్ మార్కెట్ లో కిలో ఉల్లి రూ.40 నుంచి రూ.45 ఉండగా, మార్కెట్ లో కిలో రూ.70కి చేరింది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉల్లి హోల్‌సేల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు రోడ్లపై తీవ్ర అంతరాయం ఏర్పడి ఉల్లిపాయల సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ప్రభుత్వం త్వరలో బహిరంగ మార్కెట్‌లో బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలను విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.