Nirmala : బాల్య వివాహాన్ని ఎదురించిన అమ్మాయి.. ఏపీ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో టాప‌ర్‌..

www.mannamweb.com


AP Inter Results 2024: ఒక‌ప్పుడు ఆడ‌పిల్ల‌లు అంటే స‌మాజంలో చిన్న‌చూపు ఉండేది. క్ర‌మంగా ఈ ప‌రిస్థితుల్లో మార్పులు వ‌స్తున్నాయి. అబ్బాయిల‌తో స‌మానంగా అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే.. ఆర్థిక ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఆడ‌పిల్ల‌ల చ‌దువు మాన్పించి పెళ్లిళ్లు చేస్తే త‌మ బాధ్య‌త తీరిపోతుంద‌ని భావించే త‌ల్లిదండ్రులు ఉన్నారు. కాగా.. నాడు బాల్య వివాహాన్ని ఎదురించిన బాలిక నేడు ఇంట‌ర్ ఫస్ట్ ఇయ‌ర్ ఫ‌లితాల్లో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. 440 మార్కుల‌కు గానూ 421 మార్కులు సాధించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌ర్నూలు జిల్లా ఆదోని మండ‌లం పెద్ద‌హ‌రివాణం గ్రామానికి చెందిన నిర్మ‌ల అనే బాలిక త‌న ల‌క్ష్యం దిశ‌గా అడుగులు వేస్తోంది. ప‌దోత‌ర‌గ‌తిలో 537 మార్కులు సాధించిన‌ప్ప‌టికీ.. త‌ల్లిదండ్రులు ఆమెకు బాల్య వివాహం చేయాల‌ని నిర్ణ‌యించారు. పెళ్లి ఇష్టం లేద‌ని చెప్పిన బాలిక ఐపీఎస్ కావ‌డ‌మే త‌న ధ్యేయ‌మ‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్షా ఫ‌లితాల్లో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది.

శ్రీనివాసులు, హనుమంతమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు సంతానం. వీరి చిన్న కూతురే నిర్మల‌. మిగిలిన ముగ్గురు ఆడ పిల్ల‌ల‌కు పెళ్లిళ్లు చేసి పంపించారు. చ‌దువులో మెరుగ్గా రాణిస్తున్న‌ప్ప‌టికీ ఆర్థిక ప‌రిస్థితి కార‌ణంగా త‌ల్లిదండ్రులు పై చ‌దివించేందుకు ఒప్పుకోలేదు. అయితే.. నిర్మ‌ల‌కు మాత్రం చ‌దువుకోవాల‌న్న ఆశ ఎక్కువ‌గా ఉండేది. ఈ క్ర‌మంలో గడపగడపకు కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు ఆ బాలిక ఇంటికి వెళ్లారు.

వారితో నిర్మ‌ల త‌న మ‌న‌సులో ఉన్న కోరిక‌ను చెప్పింది. ప‌దో త‌ర‌గ‌తిలో మంచి మార్కులు తెచ్చుకున్నాన‌ని, పై చ‌దువు చ‌దివించే ఆర్థిక స్థోమ‌త త‌న త‌ల్లిదండ్రుల‌కు లేద‌ని వివ‌రించింది. త‌న‌కు సాయం చేయాల‌ని, త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించాల‌ని కోరింది. వెంట‌నే స్పందించిన ఎమ్మెల్యే సాయిప్ర‌సాద్ రెడ్డి బాలిక త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడారు. అనంత‌రం అధికారుల‌తో మాట్లాడి బాలిక చ‌దువుకునేలా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

కర్నూలు కలెక్టర్‌ డాక్టర్‌ సృజన స్పందించి ఆస్పరి కేజీబీవీలో బైపీసీ గ్రూప్‌లో బాలిక‌ను చేర్పించాలని అధికారుల‌ను ఆదేశించారు. బాల్య వివాహాన్ని త‌ప్పించుకున్న బాలిక నేడు ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఫ‌లితాల్లో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. త‌న చ‌దువుకు స‌హ‌క‌రించిన అంద‌రికీ కృజ్ఞ‌త‌లు తెలిపింది.