ఇక ‘పిన్‌’తో పని లేదు.. ఇలా చేస్తే క్షణాల్లో పేమెంట్లు

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫోన్ ద్వారానే పేమెంట్లు చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం అంటూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్స్ ద్వారా కూరగాయల కొనుగోలు నుంచి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్లు చేసేస్తున్నారు.


యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేకపోవడం, ఈజీగా పేమెంట్లు పూర్తి చేయగలగడం, చిల్లర సమస్యకు పరిష్కారం లభిస్తుండడంతో యూపీఐ ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే, ఏదైనా ట్రాన్సాక్షన్ పూర్తి చేయాలంటే పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పిన్ మర్చిపోవడం, తప్పుగా ఎంటర్ అవడం వంటి కారణాలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే, ఇకపై ఆ సమస్య ఉండదు. ఎందుకంటే నేషనల్ పేమెంట్స్ కార్ఫొరేషన్ ఆఫ్ ఇండియా మరో సంచలనానికి తెర లేపుతోంది. పిన్ అవసరం లేకుండానే యూపీఐ పేమెంట్లు చేసేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది.

యూపీఐ పేమెంట్లలో త్వరలోనే కొత్త మార్పులు రానున్నట్లు సమాచారం. మీరు మీ PIN నంబర్ ఎంటర్ చేయకుండానే ఫేస్ ఐడీ, బయోమెట్రిక్ ద్వారా క్షణాల్లోనే పేమెంట్లు చేసే సదుపాయం పొందనున్నారు. ఫేస్ ఐడీ లేదా బయోమెట్రిక్స్ ద్వారా యూపీఐ పేమెంట్లను పూర్తి చేసేలా అవకాశం కల్పించే అంశాన్ని ఎన్‌పీసీఐ పరిశీలిస్తోందటా. అయితే, యూపీఐ పేమెంట్లకు పిన్ అనేది ఆప్షనల్‌గా కొనసాగించనున్నారు. ఈ విషయంపై ఈటీ వెల్త్ ఆన్‌లైన్ సంప్రదించగా ఎన్‌పీసీఐ మాట్లాడేందుకు నిరాకరించింది. అయితే, వారు ఈ విషయాన్ని తిరస్కరించలేదు లేదా ధ్రువీకరించలేదు. అయితే, క్యాష్ ఫ్రీ పేమెంట్స్ సీఈఓ, పౌండర్ ఆకాశ్ సిన్హా మాత్రం భారత డిజిటల్ పేమెంట్ల ఆవిష్కరణలో వచ్చే పెద్ద మార్పు బయోమెట్రిక్ యూపీఐ పేమెంట్స్ అని చెప్పడం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. మాన్యువల్ పిన్ ఎంట్రీపై ఆధారపడడాన్ని తొలగించి వేగంగా ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేందుకు బయోమెట్రిక్, ఫేస్ ఐడీ ఉపయోగపడుతుందని చెప్పారు.

ఎలా పని చేస్తుంది?

కొత్త విధానం గనక అమలులోకి వస్తే యూపీఐ ట్రాన్సాక్షన్లు మీ ఫింగర్ ప్రింట్, కంటి చూపు వంటి బయోమెట్రిక్స్ ద్వారా పూర్తి చేయవచ్చు. యూపీఐ సంబంధిత సైబర్ మోసాలను ఈ విధంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యూపీఐ పిన్ మాదిరిగా ఒక వ్యక్తి బయోమెట్రిక్ వివరాలను దొంగలించడం అంత సులభం కాదని చెప్పారు. పిన్ నంబర్ గుర్తుంచుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారికి ఈ కొత్త విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఏదైనా ట్రాన్సాక్షన్ పూర్తి చేసేందుకు నేరుగా ఫేస్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్ వంటి బయోమెట్రిక్స్ ఉపయోగించవచ్చు. లేదా పిన్ నంబర్ ఎంటర్ చేసేందుకు సైతం అవకాశం ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.