అమెరికా వద్దు.. ఉన్న దగ్గరే ఉద్యోగం ముద్దు

డాలర్ కలలు కరిగిపోతున్నాయి. దూరపు కొండలు నునుపు అనే సామెతలా ఆర్భాటంగా అమెరికాకు పంపిన పిల్లల తల్లిదండ్రుల ఆశలు అడియాశలౌతున్నాయి. డిసెంబర్ 15, 2025న డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ లాండ్ పిడుగులాంటి వార్త వీసాదారుల మీదకి వదిలింది.


H-1B వీసా ఉండి దేశం బయట ఉన్నవారు, ఏప్రిల్ లోగా అమెరికాకు చేరడానికి సోషల్ మీడియా వెట్టింగ్ (విచారణ) పేరిట స్టాంపింగ్ కు ప్రత్యేకంగా గడువు విధించింది. సెప్టెంబరులో H-1B వీసా పొందడానికి లక్ష డాలర్ల రుసుం కట్టాలనే నిబంధన భారతీయ విద్యార్థులకు, ఉద్యోగాలు చేసే ప్రవాస భారతీయులను గందరగోళంలోకి నెట్టింది. ఈ నిబంధనపై స్పష్టత రావడానికి నెల రోజులు పట్టింది.

గత అయిదు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే మనదేశం నుంచి అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020సం.లో 1,11,000, 2021సం.లో 3,57,000, 2022సం.లో 4,11,000, 2023సం.లో 4,46,000, 2024లో 4,00,000 వేల మంది 2025సం.లో మాత్రం కొంత వరకు తగ్గి 89,000 మంది విద్యార్థులు మాత్రమే అమెరికా చదువులకు పయనమైయ్యారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలతో ఈ సంవత్సరం వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదే సమయంలో చైనా నుండి అమెరికా చదువులకోసం వెళ్ళే విద్యార్థుల సంఖ్య కేవలం 11,000లకే పరిమితమైంది.

చెదురుతున్న కలల స్వప్నం!

పిల్లల పట్ల తెలుగు రాష్ట్రాలలోని తల్లిదండ్రుల తీరు మూస ధోరణిలోనే ఇంకా కొనసాగుతోంది. బి.టెక్ అవ్వగానే ఎలాగో ఒకలాగా పిల్లల్ని అమెరికాకు పంపితే లైఫ్ సెటిల్ అయిపోతుందనే అనే భావన బాగా ప్రబలిపోయింది. అసలు అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ట్రంప్-2కు ముందు ట్రంప్-2 తర్వాత అని రెండు భాగాలుగా చూడాల్సి ఉంటుంది. ఒక దేశ విదేశాంగ విధానానికి అనుగుణంగా మానవ వనరులు వినియోగం, సేకరణలను మార్పు చేసుకుంటుంది. ఈ విషయంలో చైనా మనకంటే ముందుంది. 2025 కంటే ముందు చైనా నుండి అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎక్కువే. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో చైనా విద్యార్థుల వలసలు తగ్గాయి. మానవ వనరుల ఎగుమతుల కంటే చైనా వస్తు ఎగుమతులపై దృష్టిసారించింది. కానీ ఇందుకు విరుద్దంగా మనదేశం మానవ వనరుల వలసలపైనే దృష్టి ఎక్కువగా పెడుతుంది.

గత ఐదు సంవత్సరాల డాటా పరిశీలనలో అమెరికాకు వెళ్ళాలనుకునేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గినట్లు కనబడదు. అమెరికాకు వెళ్ళే తెలుగు విద్యార్థులలో చాలామంది సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. వారి అమెరికా చదువుల కోసం తల్లితండ్రులు నాన్ బ్యాంకింగ్ పైనాన్సియల్ కంపెనీల నుండి 40-90లక్షల వరకు అప్పులు చేస్తున్నారు. వీటి వడ్డీ రేట్లు సగటున 10 – 13 శాతం వరకు ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లు హౌసింగ్ ఋణాల కంటే కూడా అధికం. గత రెండు మూడు సంవత్సరాల నుంచి అమెరికాలో జాబ్ మార్కెట్ చాల డల్‌గా మారిపోయింది. అప్పులు చేసిన విద్యార్థులు వారు తీసుకున్న రుణాలపై మారిటోరియం పీరియడ్ పూర్తవగానే ఇఎమ్ఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకొకవైపు చూస్తే, చదువు పూర్తవగానే H-1B వీసా అవకాశాలు కేవలం 15 శాతం మేరకే ఉన్నాయి.

అప్పులెలా తీరుస్తారు?

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను అమెరికా పంపి ఇప్పుడు బాధ పడుతున్నారు. చదువు పూర్తయిన పిల్లలు ఓపిటి మీద కొనసాగుతున్నారు. ఓపీటీ పూర్తయిున వారు ఉద్యోగాలు దొరక్క చదువుతో సంబందం లేని పనులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇంకా వారి కోసం తల్లిదండ్రులు చేసిన అప్పులపైన ఇఎమ్ఐలు నెలకు రూ.45-70వేల వరకు కట్టాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు కనీసం 7 నుండి 10వేల డాలర్లు సంపాదించగలిగే ఉద్యోగం దొరికితే తప్ప ఇక్కడి అప్పులు చెల్లించలేరు. అందువల్ల వాటిని చెల్లించడానికి తల్లిదండ్రులు భూమి లేదా బంగారు నగలను అమ్ముకుంటున్నారు.

పిల్లలు, తల్లిదండ్రులు ఆలోచించాలి!

ఇంత జరుగుతున్నా తల్లిదండ్రులలో మార్పు రావడం లేదు. అమెరికాకు పంపాలనే వెలం వెర్రితనం ఇంకా కొనసాగుతూనేఉంది. కేవలం చదువులకోసం అయితే పిల్లల్ని పంపించండి. కానీ డాలర్ డ్రీమ్‌లో పడి మాత్రం పంపించకండి. ఈ సంవత్సరం సుమారు 45 శాతం వరకు డ్రాప్ కనపడటం శుభపరిణామమే. అయినా అవకాశం దొరికితే అమెరికాకే వెళ్ళాలి, పంపాలనే పట్టుదల బి.టెక్ విద్యార్థులలో, తల్లిదండ్రులలో ఇప్పటికీ కనపడడం ఆందోళన కలిగించే విషయం.

అప్పు చేసి పప్పు కూడు కంటే, పిల్లల తమ అదృష్టాన్ని ఇక్కడే పరిశీలించుకోవడం మంచిది. నైపుణ్యం, నాణ్యత కలిగిన విద్యార్థులు ఎక్కడైనా రానిస్తారు. మీ నైపుణ్యాలకు పదును పెడితే అయినవాళ్ళతో కుటుంబ సభ్యుల మధ్య అక్కడ కంటే ఇక్కడే బ్రతకడం సులువు. లక్షల రూపాయలు అప్పు చేసి అనిశ్చిత మార్కెట్ దేశాలకు వెళ్ళేకంటే ఐటి బాగా అభివృద్ధి చెందిన హైదరాబాద్, బెంగళూరు, పూణే తదితర ప్రాంతాలపై దృష్టి పెట్టడం ఉత్తమం. తల్లితండ్రులు ఇకనైనా ఆలోచించండి. డాలర్ స్వప్నాలనుండి బయటకు రండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.