Oats Dosa : గుండెకు ఎంతో మేలు చేసే ఓట్స్‌.. వాటితో దోశలను ఇలా వేసుకోండి..!

www.mannamweb.com


Oats Dosa : మనకు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒకటి. ఇవి మనకు అద్భుతమైన పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఓట్స్‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఓట్స్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తినడం కొందరికి ఇష్టం ఉండదు. కానీ వీటితో దోశలను వేసుకుని తినవచ్చు. ఇవి రుచిగా ఉండడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇక ఓట్స్ తో దోశలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Oats Dosa
ఓట్స్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..

ఓట్స్ – అర కప్పు, బియ్యం పిండి – అర కప్పు, జీలకర్ర – ఒక టీస్పూన్‌, బొంబాయి రవ్వ – పావు కప్పు, పెరుగు – అర కప్పు, అల్లం తురుము – ఒక టీస్పూన్‌, పచ్చి మిర్చి తురుము – 2 టీస్పూన్లు, మిరియాల పొడి – అర టీస్పూన్‌, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – మూడు కప్పులు, నూనె – వేయించడానికి సరిపడా.

ఓట్స్ దోశ తయారు చేసే విధానం..

ఓట్స్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. తరువాత దానికి బియ్యం పిండి, రవ్వ, పెరుగు జోడించి కలపాలి. తరువాత జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తురుము, కొత్తిమీర తురుము, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి కలిపి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్రమాన్ని గరిటెతో రవ్వదోశ మాదిరిగానే వేయాలి. బాగా కాలిన తరువాత రెండో వైపు కూడా కాల్చి తీసి ఇష్టమైన చట్నీ లేదా కూరతో తినాలి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఓట్స్‌లోని పోషకాలన్నీ మనకు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.