పిల్లలకి చిన్నతనంలో అందించే పోషకాహారమే వారికి జీవితాంతం రక్షణగా ఉంటుందనేది కాదనలేని వాస్తవం. వారు ఎదిగే సమయంలోనే సమతులాహారం ఇవ్వగలిగితే వారి భవిష్యత్తుకు ఎంతో మేలు చేసినవారవుతారు. కొందరు పిల్లలు ఎప్పుడు చేసినా దిగాలుగా ఉంటారు. ఉత్సాహంగా ఉండేందుకు వారిలో సరిపడేంత ఎనర్జీ లేకపోవడమే అందుకు కారణం. ఈ లక్షణం బయటకు కనిపించేది మాత్రమే.
సరైన పోషకాహారం అందకుంటే మీ పిల్లల మెదడు పనితీరు కూడా డల్ గా మారిపోతుంది. అది వారి తెలివితేటలపై ప్రభావం చూపుతుంది. తద్వారా పిల్లల మెమరీ పవర్ కూడా దెబ్బతింటుంది. ఈ నష్టాలు జరగకముందే పిల్లలకు పెట్టే ఆహారంపై తల్లులు శ్రద్ధ పెట్టాలి. అందుకు వారికి రోజూవారి డైట్ లో ఈ చిన్న మార్పులు చేసి చూడండి…
మానసికంగా ఎదిగేందుకు..
పిల్లలు నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటుంటారు. ప్రతి విషయాన్ని గ్రహిస్తుంటారు. అందుకు వారికి బలమైన మెమరీ పవర్ అవసరం. ఇందుకు పోషకాహార కూడా ముఖ్యం. లేదంటే వారు చదువుల్లోనూ మెల్లిమెల్లిగా వెనకపడిపోతుంటారు. పిల్లలకు తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్, జీవనశైలి వారి తెలివితేటలకు కీలకం అయినప్పటికీ పోషకాహారం కూడా అంతే ప్రభావం చూపగలదు.
జంక్ ఫుడ్ వదలట్లేదా..?
పిల్లల తెలివితేటలపై జంక్ ఫుడ్ చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు జంక్ ఫుడ్ కి అట్రాక్ట్ అవ్వడం సహజమే. అయితే, వీటిని తినడం ద్వారా పిల్లలకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా తిరిగి అది వారి మెదడుకు పోషకాలను అందకుండా చేయగలదు. దీంతో పిల్లలు ఫోకస్ చేయలేరు. మెదడు డెవలెప్ మెంట్ ను ప్రభావితం చేస్తాయి. వారి మెమరీ పవర్ ను పెంచే ఆహారం ఇవ్వగలిగితే మాత్రం మీరు ఈ రిస్క్ నుంచి పిల్లలకు కాపాడినట్టే.
బాదం ఇస్తున్నారా?..
మెదడు పనితీరు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందులో బాదం పప్పు గురించి మాట్లాడుకోవాల్సిందే. ఇందులో ఉండే మేలు గుణాలు పిల్లలకే కాదు పెద్దల్లోనూ ఎన్నో ప్రయోజనాలను కలుగజేస్తాయి. బాదాంలో విటమిన్ ఇ, ఒమెగా 3, ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ పిల్లలను తెలివిగల వారుగా తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. రోజు రాత్రి 5 బాదాంలను నీటిలో నానబెట్టి తొక్క తీసి తినిపించడం వల్ల ఎన్నో పోషకాలు వారికి అందుతాయి.
వాల్ నట్స్ చేసే మేలు…
చూడ్డానికి అచ్చం మెదడు ఆకారంలా కనిపించే వాల్ నట్స్ కు మించిన మిత్రుడు మెదడుకు మరొకటి లేకపోవచ్చు. ఈ ఒక్కటి చాలు చిన్నారుల్లో ఒత్తిడిని తగ్గించి వారిని రోజంతా ఉత్సాహంగా ఉంచడంలో. ఇవి మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ ను పెంచగలవు.
నెయ్యి మరవద్దు..
చిన్నారుల్లో మెదడు డెవలప్ మెంట్ కు సాయపడే మరో పదార్థమే నెయ్యి. దేశీ ఆవునెయ్యిని రోజూ వారికి తినిపించడం వల్ల మెదడు నిర్మాణం ఊపందుకుంటుంది. ఇందులో హెల్తీ ఫ్యాట్స్ తో పాటు ఏ, డి, ఇ, కె కూడా ఉంటాయి. ఇవి పిల్లలు మానసికంగా స్ట్రాంగ్ గా ఉండటంతో పాటు అపారమైన తెలివితేటలను పెంచుతుంది.
పసుపు చిట్కా..
చాలా మందికి తెలియని విషయం ఇది. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం కారణంగా ఇది మతిమరుపు రాకుండా చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడును శక్తివంతంగా మారుస్తాయి. ఇది డోపమైన్, సెరోటిన్ స్థాయిలను పెంచడం ద్వారా వారు ఎల్లప్పుడూ చురుగ్గా, సంతోషంగా ఉండేలా చేస్తుంది.