ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్న నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి గెలిచిన నియోజకవర్గం కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది.
అదే సమయంలో ఆయన విజయానికి దోహదం చేసిన టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని నిలబెట్టుకోకపోవడంతో పాటు తిరిగి ఎదురుదాడి చేస్తున్నారన్న విమర్శల్ని జనసేన మోయాల్సి వస్తోంది. దీంతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు పవన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదం చేసిన వర్మను ఉద్దేశించి తాజాగా పార్టీ ఆవిర్భావ సభలో ఆయన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. పవన్ విజయానికి పిఠాపురం ప్రజలే కారణమని వారు కాకుండా ఇంకెవరైనా తాము కారణం అనుకుంటే వారి ఖర్మ అంటూ వర్మపై పరోక్షంగా నాగబాబు వేసిన సెటైర్లు విమర్శలకు కారణమయ్యాయి. దీనిపై వర్మ కూడా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవి కాదని, వాటి వెనుక మర్మం ఉన్నట్లు తెలుస్తోంది. నాగబాబు ఈ కామెంట్స్ ను ఇకపైనా కొనసాగింపుతో పాటు వాటి డోస్ కూడా పెంచబోతున్నట్లు సమాచారం. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది తాము కాదని టీడీపీయేనంటూ ఇప్పటికే జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో వర్మ తమను జనంలో బ్యాడ్ చేస్తున్నారని భావిస్తున్న జనసేన ఇప్పుడు ఆయన్ను నేరుగా టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే నాగబాబు వర్మపై పిఠాపురం సభలో విమర్శలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇలా విమర్శల దాడి కొనసాగించడం ద్వారా వర్మ వ్యవహారానికీ తమకూ సంబంధం లేదని జనసేన చెప్పేయబోతున్నట్లు సమాచారం. అయితే పిఠాపురంతో సంబంధం లేని నాగబాబు వర్మపై విమర్శలు చేస్తే అసలుకే మోసం వస్తుంది కాబట్టి ఆయనకు స్థానిక ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు తర్వాత వరుసగా నాగబాబు అక్కడ పర్యటనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా పారిశుధ్య కార్మికులను సన్మానించడం కూడా చూస్తుంటే ఆయన ఇక రెగ్యులర్ గా పిఠాపురం ఇన్ ఛార్జ్ కాబోతున్నారనే ప్రచారం జోరందుకుంటోంది.