Jana Sena : జనసేన పండుగకు సిద్ధం అంటున్న పవన్

పండుగకు సిద్ధమవుతోంది జనసేన( janasena ). పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 14న జనసేన ప్లీనరీ పిఠాపురం వేదికగా జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు పిఠాపురం ముస్తాబయింది. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన ప్లీనరీ జరగనుంది. రాష్ట్ర చరిత్రలోనే మిగిలిపోయేలా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్లు జనసేన నాయకులు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ విరామం తర్వాత అధికారానికి చేరువ అయ్యింది జనసేన. ఈ తరుణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్లీనరీగా మార్చారు. ఈ వేదికగా జనసేన కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.


ఇదే తొలి విజయం..
2014 ఎన్నికల సమయంలో జనసేన( janasena ) ఆవిర్భవించింది. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి.. కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపింది. రెండు చోట్ల మద్దతు తెలిపిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే 2019 ఎన్నికల్లో జనసేనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్.. రెండు చోట్ల ఓడిపోయారు. గత ఐదేళ్లపాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగారు. మూడు పార్టీలతో కూటమి కట్టి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు.

పిఠాపురంలో అందుకే..
అయితే పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలి విజయం అందుకున్నారు. అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గంలో అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చి అక్కడే వేదిక ఫిక్స్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి జయకేతనం సభ అని నామకరణం చేశారు అధినేత పవన్ కళ్యాణ్. లక్షలాదిమంది జనసైనికులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలో జనసేనకు బలం ఎక్కువ. దీంతో పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం అవుతుందని జనసేన నేతలు నమ్మకంగా చెబుతున్నారు.

కీలక నిర్ణయాలు
జనసేన పార్టీ( janasena party ) ఆవిర్భావ దినోత్సవ సభలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజకీయపరమైన అంశాలకు ఆమోదం తెలిపే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూనే జనసేన బలోపేతంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఇదే వేదికపై జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. పలువురు తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున జనసేన గూటికి వస్తారని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.