అక్కాచెల్లెళ్ల అద్భుత ఆలోచన.. గోమూత్రంతో ప్యాపారం.. ఏడాది రూ. లక్షల్లో సంపాదన..

www.mannamweb.com


సాధారణంగా గ్రామాలలో వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం ఎక్కువగా కనిపిస్తుంది. రైతులు తమ పొలాలలో గేదెలను, ఆవులను పెంచుతూ ఉంటారు. వాటి పాలను విక్రయించడం ద్వారా వారికి ఆదాయం లభిస్తుంది.

ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆవు మూత్రంతో కూడా వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారనే విషయం మీకు తెలుసా. మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన అక్కాచెల్లెళ్లు ఈ ఘనత సాధించారు. గోమూత్రంతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. తమతో పాటు అనేక మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

లక్షల్లో సంపాదన..

మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ఉమా బిరాజ్‌దర్, రుద్రప్ప బిరాజ్‌దర్ అక్కాచెల్లెళ్లు. వీరు ఆవు మూత్రాన్ని విక్రయిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. గోవులను దైవ స్వరూపాలుగా భావిస్తారు. ఆ స్ఫూర్తితోనే వీరిద్దరూ సౌత్ షోలాపూర్ ప్రాంతంలోని వడక్‌బాల్‌లో కత్వాదేవి గోశాలను ఏర్పాటు చేశారు. అందులోని గోవుల మూత్రాన్ని సేకరించి తమ వ్యాపార వస్తువుగా మార్చుకున్నారు. రకరకాల ఉత్పత్తులను తయారు చేసి వ్యాపారంలో విజయం సాధించారు. తమ గ్రామంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన 250 నుండి 300 మంది మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు.

గోమూత్రంతో వ్యాపారం..

ఆవు మూత్రం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది చెబుతుంటారు. ఈ విషయాన్ని నమ్మేవారితో పాటు సందేహం వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. అయితే షోలాపూర్ అక్కాచెల్లెళ్లు గోమూత్రం ఎంతో గొప్పదని నమ్ముతారు. దాని విలువను ప్రజలకు తెలియజేసేందుకే వ్యాపారం ప్రారంభించినట్టు వెల్లడించారు.

ఖిల్లార్ జాతి ఆవులు..

కత్వాదేవి శాలలో ఖిల్లార్ జాతి ఆవులను పెంచుతున్నారు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే అక్కడి ఆవుల నుంచి గోమూత్రాన్ని సేకరిస్తారు. ముఖ్యంగా ఖిల్లార్ ఆవు మూత్రంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఆరోగ్యంతో పాటు వ్యవసాయ రంగానికి దీన్ని ఉపయోగిస్తారు. అలాగే పూజల సమయంలో, మరణం తర్వాత నిర్వహించే సంప్రదాయ పద్ధతులలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తారు.

సేంద్రియ సాగు..

సేంద్రియ వ్యవసాయ సాగు చేస్తున్నవారికి ఆవు మూత్రం చాలా అవసరం. ద్రాక్ష, మామిడి తదితర తోటలు, ఆకు కూరలు, పండ్లు పండించే రైతులు తమ పొలాలకు ఆవు మూత్రాన్ని వినియోగిస్తారు. ఉమా బిరాజ్‌దర్ కు చెందిన కత్వాదేవి గోశాలకు వచ్చిన దాన్నికొనుగోలు చేస్తారు. పంటలను ఆశించే వివిధ తెగుళ్లను నివారించడానికి ఆవుమూత్రాన్ని పిచికారీ చేస్తారు.

వివిధ ఉత్పత్తులు..

కత్వాదేవి గోశాలలో లీటర్ గోమూత్రాన్ని రూ.30కి విక్రయిస్తున్నారు. రైతులే నేరుగా గోశాలకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అలాగే గోమూత్రంతో గోనిన్ అనే లిక్వడ్ తయారు చేస్తున్నారు. ఈ ద్రావణాన్ని ఫ్లోర్ క్లీనర్ గా, రూమ్ ఫ్రెషనర్‌గా ఉపయోగించుకోవచ్చు. మరో ముఖ్య విషయం ఏమిటంటో గోనిన్ వాసనకు దోమలు దూరంగా పారిపోతాయి. ఈ ద్రావణానికి ఆ ప్రాంతంలో విపరీతమైన డిమాండ్ ఉంది. మహిళా బచత్ సమూహ్ అనే స్వయం సహాయక బృందం మహిళలు కూడా ఈ ఉత్పత్తులను విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. బిరాజ్‌దర్ సోదరీమణులు చేస్తున్న గోమూత్రం వ్యాపారం ఈ ఏడాది చివరకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు చేరుకుంటుందని అంచనా.