ఒకే ప్లాన్‌లో పెన్షన్ + హెల్త్ ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు

పదవీ విరమణ ( Retirement ) తర్వాత ప్రశాంతంగా జీవించాలంటే కేవలం చేతిలో డబ్బు ఉంటే సరిపోదు, అనుకోని వైద్య ఖర్చులను తట్టుకునేలా ఆరోగ్య భద్రత కూడా ఉండాలి.

సరిగ్గా ఈ పాయింట్ నుంచే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ’ ( PFRDA ) ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. అదే ‘ఎన్‌పీఎస్ స్వస్థ్య’ ( NPS Swasthya ). పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ రెండూ కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే ఈ స్కీమ్ ప్రత్యేకత.


NPS Swasthya Pension Scheme : ఏంటి ఈ ‘NPS స్వస్థ్య’ స్కీమ్?

సాధారణంగా మనం పెన్షన్ కోసం ఒక స్కీమ్, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మరో పాలసీ తీసుకుంటాం. కానీ ఈ NPS Swasthya Pension Scheme ఒక కాంబో ప్లాన్. ఇందులో మీరు పొదుపు చేసే మొత్తంలో కొంత భాగం మీ పెన్షన్ కార్పస్ (నిధి)కి వెళితే, మిగిలిన భాగం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా మళ్లుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ తో పాటు, ఆసుపత్రి ఖర్చుల కోసం బీమా రక్షణ కూడా లభిస్తుంది.

వృద్ధాప్యంలో ప్రీమియం కట్టే పనిలేదు

ఈ స్కీమ్ లో ఉన్న అతిపెద్ద వెసులుబాటు ఏంటంటే.. వృద్ధాప్యంలోకి వచ్చాక ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం వేరేగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీ పెన్షన్ కార్పస్ నుంచే ఆటోమేటిక్ గా ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు.

ఎవరెవరు అర్హులు? ( Eligibility )

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాదారులు అందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధి (Self-employed) పొందేవారు, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటున్న సామాన్యులు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

పెట్టుబడి ఎంత? లాభాలేంటి?

కేవలం రూ. 1,000 కనీస పెట్టుబడితో ఈ స్కీమ్ ప్రారంభించవచ్చు. పెట్టుబడికి ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. మీరు వైద్య ఖర్చుల కోసం కేటాయించిన డబ్బును ఒకవేళ ఉపయోగించకపోతే, ఆ మొత్తంపై కూడా వడ్డీ (Interest) లభిస్తుంది. దీనివల్ల దీర్ఘకాలంలో పెద్ద మొత్తం చేతికి అందుతుంది. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య ఖర్చులకు ఈ డబ్బును వాడుకోవచ్చు.

40 ఏళ్లు దాటిన వారికి బంపర్ ఆఫర్

ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించి, 40 ఏళ్లు నిండిన ఇతర NPS ఖాతాదారులకు PFRDA ఒక వెసులుబాటు కల్పించింది. వారు తమ NPS అకౌంట్ లో ఉన్న మొత్తంలో గరిష్ఠంగా 30 శాతం వరకు ఈ ‘NPS స్వస్థ్య’ స్కీమ్ కు మళ్లించుకోవచ్చు. అంటే అప్పటికే పోగుపడిన పెన్షన్ డబ్బులో కొంత భాగాన్ని ఆరోగ్య రక్షణ కోసం బదిలీ చేసుకోవచ్చన్నమాట.

పన్ను మినహాయింపులు ( Tax Benefits )

ఈ స్కీమ్ కూడా NPS పరిధిలోకే వస్తుంది కాబట్టి, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, 80CCD కింద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. మీరు కట్టే ప్రీమియం, చేసే పొదుపు రెండింటికీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.

మొత్తంగా చూస్తే.. అటు రిటైర్మెంట్ సేవింగ్స్, ఇటు హెల్త్ సెక్యూరిటీ రెండూ కావాలనుకునే వారికి ఈ ‘ఎన్‌పీఎస్ స్వస్థ్య’ ఒక అద్భుతమైన అవకాశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.