పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు పోలీసులు ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే అని జీవీ హర్షకుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఇందుకు సంబంధించి హర్షకుమార్ సాక్ష్యాన్ని నమోదు చేయనున్నట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5లోపు దర్యాప్తు అధికారికి మీ వద్ద ఉన్న సాక్ష్యాలు అందించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, రాజానగరం పోలీస్ట్ స్టేషన్ పేరుతో ఈ నోటీసు జారీ అయ్యింది. ఈ నోటీసులను జీవీ హర్షకుమార్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ నోటీసులు నిజాన్ని దాయగలవా? హర్షకుమార్ ను ఆపగలవా? అంటూ పోస్ట్ చేశారు.
ముమ్మాటికీ హత్యే: హర్ష కుమార్ ఆరోపణలు
ఇదిలా ఉంటే.. ప్రవీణ్ మృతిపై మాజీఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ముమ్మాటికీ ఇది హత్యేనన్నారు. ప్రవీణ్‌ది హత్య అనడానికి 3 కారణాలు కనిపిస్తున్నాయన్నారు. హిందూ మతోన్మాదులు, ముస్లిం మతోన్మాదులు లేదా క్రైస్తవ మతోన్మాదులు ఈ హత్యకు కారణం కావొచ్చన్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం వల్లే కేసుపై అనుమానాలు రేకెత్తాయన్నారు.
పోస్టుమార్టం నివేదిక సక్రమంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో కేసు విచారణ సక్రమంగా జరగకపోతే.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్లి రీ ఇన్వెస్టిగేషన్ జరిగేలా చూస్తానన్నారు. నిన్న తాము సంయమనం పాటించడం వల్లే పోలీసులు మృతదేహాన్ని హైదరాబాద్ తరలించగలిగారన్నారు.