Postal FD: చిన్న మొత్తాల్లో డబ్బు దాచుకునేందుకు పోస్ట్ ఆఫీస్ పథకాలు చాలా అనువుగా ఉంటాయి. స్థిరమైన ఆదాయంతో పాటు పన్ను మినహాయింపులు కూడా కలిగి ఉండటం వీటికి అదనపు హంగు అని చెప్పవచ్చు.
పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న వివిధ పోస్ట్ ఆఫీస్ పథకాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన రాబడి ఇచ్చే సంస్థ కావడంతో పోస్ట్ ఆఫీస్ పథకాలపై ఈ మధ్య జనం మక్కువ చూపిస్తున్నారు. అందుకే స్టాక్ మార్కెట్, బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల కంటే ఎక్కువగా నమ్ముతున్నారు. FDలపై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుడటం కూడా పోస్టాఫీసు పథకాల వైపు ప్రజలను మళ్లిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇండియా పోస్ట్ 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా (TD) లేదా నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్ గా దీనిని పేర్కొంటారు. వరుసగా 1, 2, 3 మరియు 5 సంవత్సరాల పాటు సౌకర్యవంతమైన డిపాజిట్ కాలాన్ని ఆఫర్ చేస్తోంది. ఇది EEE కేటగిరీ కిందకు వస్తుంది. తద్వారా పెట్టుబడి పెట్టేటపుడు, విత్‌డ్రా సమయంలోనూ ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. కనీస పెట్టుబడి కూడా కేవలం వెయ్యి రూపాయలే.
పన్ను ఆదా చేయాలనుకునే వారి కోసం ఈ పోస్ట్ ఆఫీస్ ట్యాక్స్ సేవింగ్ FDని పోస్టల్ విభాగం అమలుచేస్తోంది. దీని ద్వారా 7.5 శాతం మేర వడ్డీ పొందవచ్చు. అన్ని ఇతర పోస్ట్ ఆఫీస్ FDలలో ఇదే అత్యధిక వడ్డీరేటు కావడం గమనార్హం. ఇందులో 5 ఏళ్లపాటు 10 లక్షలు పెట్టుబడి పెడితే.. 4 లక్షల 49 వేల 948 మొత్తం వడ్డీ రూపంలో అదనంగా అందుతుంది. ఫలితంగా మెచ్యూరిటీ విలువ దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది.
ఆకట్టుకునే రాబడితో పాటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా ఈ అయిదేళ్ల FD అందిస్తుంది. కాబట్టి 1.50 లక్షల వరకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. వడ్డీ పన్ను రహితంగా ఉన్నప్పటికీ, సీనియర్ సిటిజన్‌లకు 50 వేలు మరియు ఇతరులకు 40 వేల వరకు పరిమితి వర్తిస్తుంది.