మధ్యంతర భృతికి మంగళమేనా?

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీని ప్రభుత్వాలు ఇవ్వాలి. ప్రభుత్వం విడుదల చేసిన గత ఉత్తర్వులలోనే ఇది ఉంది. కానీ దీన్ని అమలు పరచడంలో ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటుంది.


గత ప్రభుత్వం పదేళ్లకే పీఆర్సీ అంటూ కొత్త విధానానికి తెరలేపి ఉద్యోగ ఉపాధ్యాయులను నోరు మూయించి, కొత్త డిమాండ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ కొత్త డిమాండ్‌ను పరిష్కరించుకోవడం కోసం సంఘాలు నానాయాతనలు పడ్డాయి. ఉన్న సమస్యలను పక్కనపెట్టి ఐదేళ్లకే పీఆర్సీ అనే కొత్త డిమాండ్‌ను ప్రభుత్వం పరిష్కరించిట్లు ఉద్యోగ సంఘాలు ఆర్భాటంగా ప్రకటించుకున్నాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఐ.ఆర్ ఆలస్యం చేస్తుండటం బాధాకరం.

పీఆర్సీ కమిటీ వేసిన తర్వాత, సకాలంలో వేతన స్థిరీకరణ జరగనందున ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం సమాంతరం చేయడం కోసమే ఐ.ఆర్ మంజూరు చేస్తారు. 2023 జూలై 1 నుండి కొత్త పీఆర్సీ అమలు పరచాలి. కానీ ఇప్పటివరకు 1 సంవత్సరం, 7 నెలలు గడిచిన పీఆర్సీ ఆలస్య కాలానికి మధ్యంతర భృతి లేదు. మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ ఉపాధ్యాయులుగా డిమాండ్ చేస్తున్నా ఫలితం లేదు. దీంతో లక్షల్లో నగదు ప్రతి ఉద్యోగి నష్టపోయినట్లే. మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌గా గత ప్రభుత్వం జూలై 2023లో నియమించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్ చైర్మెన్‌గా తప్పుకోవటం జరిగింది. తదనంతరం కొత్త కమిటీని ఇప్పటి వరకు నియమించలేదు. ఈ ఆలస్యకాలానికి ఉద్యోగులు బాధ్యులు కారు, కాబట్టే మధ్యంతర భృతి డిమాండ్ చేస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది.

ఉద్యోగులకు అన్యాయం

ఇప్పటివరకు ఏపీలో మధ్యంతర భృతి లేని పీఆర్సీ లేదు. గత పీఆర్సీలను పరిశీలిస్తే, 9వ పీఆర్సీలో 22 శాతం ఐ.ఆర్ జనవరి 2009 నుంచి, 10వ పీఆర్సీలో 27 శాతం ఐ.ఆర్ జనవరి 2014 నుంచి, 11వ పీఆర్సీలో 27% ఐ.ఆర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పీఆర్సీ ఆలస్యమైన ఆరు నెలల్లోనే మధ్యంతర భృతి ప్రకటించిన కాలాలు ఎక్కువ ఉన్నాయి. 12వ పీఆర్సీ ఇప్ప టికీ 1 సంవత్సరం, 7నెలలు ఆలస్యం కావస్తున్న మధ్యం తర భృతి లేదు. ఇలానే కొనసాగితే మధ్యంతర భృతి లేని వచ్చే పీఆర్సీ తెలంగాణ మాదిరి కాక తప్పదు. సంవత్సరాల కాలం పాటు మధ్యంత భృతి ఉండదు, పీఆర్సీ ఉండదు. దీంతో పెరిగిన ధరల కనుగుణంగా, ద్రవ్యోల్బణ సూచిక ఆధా రంగా పెరగాల్సిన వేతనాలు చేజారి పోతాయి. దీంతో రాబోయే కాలంలో పీఆర్సీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర, ఉద్యోగ, ఉపాధ్యాయులు సకాలంలో పీఆర్సీ పొందక పోవడం వల్ల ఒక విడత అంత పీఆర్సీ నష్టపోయారు. మధ్యంతర భృతి మంగళం పాడితే పీఆర్సీకి మంగళం పాడినట్లే. పీఆర్సీ ఫిట్మెంట్, ఐఆర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఐ.ఆర్ లేనప్పుడు ఫిట్మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. దీన్ని సమాంతరం చేయడం సున్నితమైన అంశం.

30 శాతం ఐఆర్ ప్రకటించాలి!

ఆర్థిక అంశాలను, ధరల సూచికలను పరిశీలించి, కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఐ.ఆర్ శాతాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిటీని పునర్వ్యవస్థీకరణ చేయలేదు. ప్రభుత్వం ఇప్పటికైన పీఆర్సీ కొత్త కమిటీని నియమించి సూత్రప్రాయంగా ఐ.ఆర్‌ను ప్రతిపాదింపచేసి ఐ.ఆర్ ప్రకటనకు నాంది పలకాల్సి ఉంటుంది. 11వ పీఆర్సీకి తగ్గకుండా 30 శాతం ఐ.ఆర్ ప్రకటించాలని యావత్ ఉద్యోగుల ఆశను కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. ప్రభుత్వం సానుకూల వాతావరణంలో సంఘాలతో చర్చలు జరిపి సాగవేతకు చరమాంకం పలకాల్సి ఉంది.

ప్రభుత్వంపై ఆశాభావం

పీఆర్సీ ఆలస్యంగా ఇవ్వడం వల్ల పదవీ విరమణ చెందే ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. దీనివల్ల పింఛను ఆర్థిక లాభాలు తగ్గే అవకాశం ఉంది. కమ్యుటేషన్ చెల్లింపులో మార్పులు ఉండవు. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. పీఆర్సీ నోషనల్ పీరియడ్ ప్రభుత్వం నిర్ణయించే కాలాన్ని బట్టి ఇప్పటినుండి 2023 జూలై వరకు పదవీ విరమణ చెందువారిపై ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. ప్రతిసారి పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యం వలన లక్షలాది రూపాయలు బకాయిలు ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తున్నది. సకాలంలో పీఆర్సీ కమిటీలు మధ్యంతర భృతి చెల్లిస్తే సమస్య ఉండదు. గత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఐ.ఆర్ 27 శాతం కంటే తక్కువ ఫిట్మెంట్ 23%తో పీఆర్సీ చేయడం వల్ల ఉద్యోగుల వేతనాలు ధరలకు అనుగుణంగా పెరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని గమనించాల్సి ఉంటుంది. కావున నోషనల్ పీరియడ్ 2023 జూలై నుండి ఏప్రిల్ 2024 వరకు సూత్రప్రాయంగా సూచించాల్సి ఉంటుంది. సదరు కాలానికి పింఛను ఆర్థిక లాభాలు సవరణ చేసుకొనుటకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత ధరలు, ద్రవ్వోల్బణం సమన్వయ పరచుకుని పీఆర్సీ, ఐ.ఆర్‌లు ముందుకు తీసుకు వస్తారన్న ఆశాభావం ఉద్యోగుల్లో ఉంది. దీన్ని నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. మరీఆలస్యం అయితే ఉద్యోగులకు నష్టమే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.