అసలే అక్రమ వ్యాపారం.. పైగా ప్రభుత్వం మారింది.. ఊరుకుంటారా? ఊరికేనే ఉంటారా? ముందే జాగ్రత్త పడ్డారు. సరుకు మొత్తం సర్దేశారు. ఇదీ.. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నచర్చ.
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వ్యాపారాలు, వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని విదేశాలకు పంపించారన్నది ఒక్కటే కాకుండా.. రైస్ మిల్లుల నిర్వహణపై కూడా కేసులు నమోదవుతున్నాయి.
తన బినామీలతో రైస్ బిల్లులను ఏర్పాటు చేయించి.. సార్టెక్స్ మిషన్ల ద్వారా రేషన్ బియ్యాన్ని పాలిష్ చేయించి.. వాటిని విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు బొక్కేశారన్నది ప్రధానంగా ద్వారంపూ డి పై వినిపిస్తున్న మాట. ఈ విషయాన్ని సర్కారు సీరియస్‌గానే తీసుకుంది. అంతేకాదు.. చంద్రశేఖరరెడ్డికి .. రొయ్యల ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఆక్వా ఫ్యాక్టరీలను ఆయన సుదీర్ఘ కాలం నుంచి కూడా నడిపిస్తున్నారు. తాజాగా కాలుష్యం పేరుతో ఆయన ఆక్వా ఫ్యాక్టరీలను మూసేయించారు.
అయితే.. ప్రబుత్వం ఇలా చేస్తుందని.. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ తనను టార్గెట్ చేస్తారని ద్వారం పూడి ఊహించలేనంత వ్యాపార వేత్త అయితే కాదు. అందుకే.. ఆయన ముందుగానే సరుకును సర్దేశార న్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. అంతేకాదు.. తన పేరిట ఉన్న బినామీమిల్లులను కూడా విక్రయించా రని చెబుతున్నారు. ఇక, రొయ్యల ఫ్యాక్టరీ విషయంలో కూడా.. సరుకు లేకుండా చూశారని అంటున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని అధికారులు కూడా గుర్తించారు.
వైసీపీ సర్కారు పడిపోయిన తర్వాత.. ద్వారంపూడి జాగ్రత్తలు తీసుకున్నారని, ముఖ్యంగా పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన మరింత అలెర్ట్ అయ్యారని అంటున్నారు. అయితే.. ద్వారం పూడి సర్దేసినా.. వాటిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం గమనార్హం. మరి ఎంత వరకు ఈ విషయంలో సక్సెస్ అవుతారో చూడాలి. ఏదేమైనా.. ద్వారంపూడి ముందు జాగ్రత్త ఇప్పుడు చర్చకు దారితీసింది.