ప్రమోషన్ మాత్రమే సరిపోదు.. జక్కన్న ముందు చూపుకు హ్యాట్సాఫ్

క సినిమా ప్రజలలోకి వెళ్ళాలి అంటే కచ్చితంగా ఆ సినిమాకు ప్రమోషన్స్ తప్పనిసరిగా జరిపించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రమోషన్స్ చేసేటప్పుడు ఈవెంట్లు కూడా నిర్వహిస్తారు.


అలా ఈవెంట్లు నిర్వహించే సమయంలో తమ సినిమాకు ప్రమోషన్ చేసుకోవడం మాత్రమే కాదు ఆ ఈవెంట్ కి వచ్చిన అభిమానులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా చిత్ర నిర్మాతల పైనే ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. చాలా సినిమాలు పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి కానీ అందుకు తగ్గట్టుగా సరైన ఏర్పాట్లు లేక ప్రజలు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

ఈ బాధ్యతను ఎవరు వహిస్తారు? తమ అభిమాన హీరో, హీరోయిన్ ఈవెంట్ కి వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడం, బాధిత కుటుంబీకులకు ఎంత నష్టాన్ని మిగులుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని జరుగుతున్నా.. కొన్ని కొన్ని ఈవెంట్లు ఇప్పటికీ ఎలాంటి పగడ్బందీ ప్లాన్ లేకుండా జరుగుతూ.. అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్నారు. అయితే ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూడాలని అధికారులు కూడా స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే.

అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రాజమౌళి చాలా ముందు చూపుతో తన ఈవెంట్ ను నిర్వహించడానికి సిద్ధమైపోయారు. తన టీమ్ కి దిశా నిర్దేశం చేస్తూ ఎప్పుడు? ఎవరిని? ఎలా? ఈవెంట్ లోపలికి పిలవాలి.. ప్రేక్షకులు ఏ మార్గం గుండా ఈవెంట్ లోకి హాజరవ్వాలి? అతిధులు ఎలా రావాలి? ఇలా ప్రతి విషయంపై కూడా ఒక బోర్డ్ పైన విశ్లేషిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు రాజమౌళి.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎస్ఎస్ఎంబి 29 అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా 2027లో విడుదల కాబోతున్న నేపథ్యంలో గ్లోబ్ ట్రోటర్ అంటూ ఒక ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగే ఈ ఈవెంట్ కు సంబంధించి పాస్పోర్ట్ లాంటి పాసులు ఇవ్వడమే కాకుండా.. ఫిజికల్ పాస్ లు ఉన్న వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు దీనికోసం తన టీం తో స్పెషల్ గా బోర్డు మీద డీటెయిల్స్ కూడా వివరిస్తున్నారు జక్కన్న.

ఇందుకు సంబంధించిన వీడియోని.. ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించనున్న సుమ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా రాజమౌళి డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ వీడియోని మనం గమనించినట్లయితే.. ఈవెంట్ ను ఎలా కండక్ట్ చేయాలి? ఎప్పుడు ఎవరిని అలర్ట్ చేయాలి? అసలు ఫ్యాన్స్ ఎక్కడి వరకు రావాలి? సుమా ప్రోగ్రాం ను ఎలా నడిపించాలి? ఎప్పుడు క్లోజ్ చేయాలి? ప్రోగ్రాం లో ఏది ఎక్కడ ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా దగ్గరుండి మరీ రాజమౌళి వివరిస్తున్నారు.

ఇందులో కీరవాణి, సుమ తో పాటు ఇతర టీమ్ మొత్తం పాల్గొన్నారు. మొత్తానికైతే ఈ మధ్యకాలంలో ఈవెంట్లలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ఇలా చాలా పగడ్బందీగా తన ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈవెంట్ పేరిట సినిమాకి ప్రమోషన్ చేయడమే కాదు.. ఆడియన్స్ గురించి ముందు చూపు కూడా ఉండాలి అని.. జక్కన్న ముందు చూపుకి అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.