టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తోన్న కారు, ఓ గూడ్స్ ఆటో ఢీ కొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల..
ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో.. రోడ్డుపై ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్ వాగ్వాదానికి దిగడం కనిపిస్తోంది. ఇది చిన్న ప్రమాదమే కావడంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం.. ద్రవిడ్ డ్రైవింగ్ నిర్లక్ష్యమా లేదా ఆటో డ్రైవర్ డ్రైవింగ్ నిర్లక్ష్యమా అనేది స్పష్టంగా తెలియలేదు.
ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని బిజీ ఏరియా కన్నింఘమ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ లో ఆటో డ్రైవర్ వెనక నుంచి స్పీడ్ గా వచ్చి ఢీ కొట్టాడని, ద్రవిడ్ చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి 11 సెకన్ల వీడియో వైరల్ గా మారింది. వీడియోలో.. ద్రవిడ్ కారులో నుంచి దిగి.. తన కారుకు జరిగిన డ్యామేజ్ ను పరిశీలించి, అనంతరం డ్రైవర్ ను కన్నడ భాషలో ప్రశ్నిస్తున్నట్లుగా కనిపించింది. డ్రైవర్.. యాక్సిడెంట్ ఎలా చోటు చేసుకుందో వివరిస్తున్నట్లుగా కూడా ఈ వీడియోలో ఉంది.
హై గ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జురిడిక్షన్ లో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. కానీ ఇంకా దీనిపై అఫీషియల్ గా కంప్లైంట్ రిజిస్టర్ కాలేదని తెలిసింది. ప్రస్తుతానికి ద్రవిడ్ ఆటో డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయారట.































