Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

www.mannamweb.com


Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

అమరావతి: బెంగళూరు (Banglore) ఎలక్ట్రానిక్ సిటీ (Electronic City) సమీపంలోని ఓ ఫాం హౌస్‌ (Farm House)లో జరిగిన రేవ్ పార్టీ (Rave Party)లో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే రేవ్ పార్టీ లో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసు (Vasu)గా పోలీసులు గుర్తించారు. వన్ టౌన్ కొత్తపేటలోని ఆంజనేయవాగుకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. విజయవాడలోనూ అతిపెద్ద బుకీల నెట్‌వర్క్‌ను వాసు విస్తరించాడు. పైకి మాత్రం వ్యాపారం, ఫార్మా రంగాల పేర్లను ఉపయోగించుకుంటున్నాడని, డీజీపీ కార్యాలయంలో కొంత మంది అధికారుల పేర్లను వాసు ఉపయోగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్‌లతో పాటు డ్రగ్స్ వ్యవహారంలోనూ వాసు కీలక సూత్రధారి. విజయవాడలోని గాంధీనగర్‌లో తన స్నేహితుడితో కలిసి రూ.6 కోట్లతో ఒక స్థలం కొనుగోలు చేశాడు. బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఏపీ పోలీసుల నంబర్లు ఉండటంతో లోతుగా విచారణ జరుపుతున్నారు. వాసు దందాలకు కొంతమంది పోలీసులు అండగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ కొనసాగుతోంది.

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నాన్ స్టాప్‌గా పార్టీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు (Police) తెలిపారు. నిర్వాహకుడు వాసుతోపాటు అరుణ్ (Arun), సిద్దికి (Siddiqui), రన్‌దీర్ (Randhir), రాజ్ భవ్‌ (Raj Bhav)లను పోలీసులు అరెస్టు చేశారు. వాసు బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. సిద్దికి, రన్‌దీర్, రాజ్‌భవ్‌లను డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరు పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కింది.

కాగా బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్‌ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్‌ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు.

కన్నడ సీరియల్‌ నటులతోపాటు 20 మందికిపైగా మోడల్స్‌ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 17 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్‌తోపాటు 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమైందని తెలిసింది. ఐతే.. ఈ ఆరోపణలను కాకాణి ఖండించారు. ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఎలక్ర్టానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఈ పార్టీలో పాల్గొన్న 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఈవెంట్‌ కోసం ఫౌంహౌస్‌ నిర్వాహకులకు రూ.30 నుంచి రూ.50 లక్షలు చెల్లించినట్టు సమాచారం. రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు డ్రగ్స్‌ తీసుకున్నారు..? అనేది తెలియరాలేదు. అందుకోసం మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.