Ravindra Jadeja Retires: విరాట్ కోహ్లీ, రోహిత్ బాటలనే మరో భారత క్రికెటర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్ కప్ విజయం సాధించిన ఒక రోజు తర్వాత తాను వీడ్కోలు పలుకున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు.
ఎంతో గర్వంగా కెరీర్‌ను ముగిస్తున్నా..
‘టీ20 ప్రపంచకప్ గెలుపుతో తన కల నిజమైంది.. దేశం గెలుపు కోసం ఇతర ఫార్మాట్ లలో కృషి చేస్తా. గుండెనిండా కృతజ్ఞత భావంతో టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. ఎంతో గర్వంగా కెరీర్‌ను ముగిస్తున్నా. దేశానికి ఆడిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రతిభ కనబరిచాను. ఇక మిగతా ఫార్మాట్లలోనూ అదే తరహాలో ఆడుతా. ఇది నా టీ20 కెరీర్‌లో గొప్ప ఘట్టం. ఇన్ని రోజులు నాకు సపోర్టుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు’ అంటూ ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ అయ్యాడు జడ్డూ.
శనివారం బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి రెండో టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విజయానందంలోనే గొప్ప ముగింపు కోరుకున్న విరాట్ (Virat Kohli), రోహిత్ (Rohit Sharma) టీ20లకు వీడ్కోలు పలికారు. అయితే వీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్న 24 గంటల్లోనే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇకపై తాను వన్డే, టెస్ట్ సిరీస్ లలోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు.