నారా లోకేష్ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

www.mannamweb.com


విజయవాడను పెద్ద ఎత్తున వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. ఏకంగా సీఎం చంద్రబాబు సహా మంత్రులు, అధికారులు అంతా విజయవాడలోనే తిష్ట వేసి మరీ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతున్నారు. బాధితులకు మూడు పూటలా భోజనంతో పాటు వాటర్ సదుపాయం కల్పిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి మరీ సహాయక చర్యలు బాధితులకు అందేలా చూస్తున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈరోజు సహాయక చర్యల్లో ఆరు హెలికాప్టర్లు ద్వారా ఆహారం, తాగు నీటిని సరఫరా చేశారు. బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్‌లో 2,500 ఆహార పొట్లాలను చేరవేస్తున్నారు. విజయవాడ పరిధిలో వరద ముంపునకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి లోకేష్ పిలుపు మేరకు సహాయ చర్యల్లో రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో 14,452 మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు.

ప్రకాశం బ్యారేజి వద్ద వేగంగా వరద తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుత వరద ప్రవాహం 8,71,776 క్యూసెక్కులకు చేరుకుంది. మరోవైపు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితులు, బాధితులకు అందుతున్న ఆహారం గురించి ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాగునీరు, ఆహారం ప్రతి ఒక్కరికి చేరాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయక చర్యల్లో కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ఇప్పటికే మచిలీపట్నం నుంచి విజయవాడకు టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. బాధితులకు అండగా నిలవాలని, భరోసా కల్పించాలని కార్యకర్తలందరికీ కొల్లు రవీంద్ర సూచించారు.