మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Delhi Excise Policy Scam Case)లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్ లభించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తిహాడ్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయన మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.