రోగమేంటో తెలిస్తే చికిత్స సులభం అవుతుంది. డాక్టర్లు కూడా ఇదే చెబుతుంటారు. అందుకే పేషెంట్లను చెక్ చేసిన తర్వాత అవసరమైన టెస్టులకోసం రిఫర్ చేస్తుంటారు.
రిపోర్ట్ వచ్చాక అవసరమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ రోగ నిర్ధారణ చాలా ముఖ్యం. అయితే ఇది అన్ని అనారోగ్యాలకూ ఒకేలా ఉండదు. కొన్ని నిర్ధారణలు ఆలస్యం అవుతుంటాయి. ఇక వైరస్ శరీరంలో ఉందా, చికిత్స అవసరమా అని తెలుసుకోవాలంటే HCV RNA PCR టెస్ట్ తప్పనిసరి. ఈ ఫలితాలు రావడానికి సాధారణంగా 3 నుంచి 15 రోజులు పడుతుంది. కానీ ఈ ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ సైంటిస్టులు 15 నిమిషాల్లో పూర్తి చేయగలిగే కొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేశారు.
హెపటైటిసిస్ సి (HCV) టెస్టుల్లో, ట్రీట్మెంట్‌లో ఆలస్యాన్ని నివారించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని, పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేశారు. మొదట కోవిడ్-19 కోసం అభివృద్ధి చేసిన DASH® ప్లాట్‌ఫాంను వేగవంతమైన హెచ్‌సీవీ పరీక్షల నిర్ధారణకు అనుగుణంగా అనుకూలించారు. ఇది వివిధ వ్యాధులకు అనుకూలమైన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (POC) డయాగ్నస్టిక్స్ సిస్టమ్‌గా రూపొందింది. కాబట్టి దీని ద్వారా రక్తసేకరణ తర్వాత 15 నిమిషాల్లో హెపటైటిస్ సి పరీక్షను పూర్తి చేయవచ్చు. అంటే ఇది రోగ నిర్ధారణ సమయాన్ని 75% తగ్గించడం ద్వారా త్వరగా చికిత్సను ప్రారంభించేందుకు సహాయపడుతుంది. ఇది త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
ఇప్పటి వరకున్న హెచ్‌సీవీ పరీక్ష విధానం ఆలస్యంతో కూడుకున్నది. ఫలితాలు రావడానికి వారం నుంచి 15 రోజులుపడుతుంది. కానీ కొత్తగా అభివృద్ధి చేసిన DASH® పరికరింతోపాటు దానికి సంబంధించిన టెస్టింగ్ విధానంతో 15 నిమిషాల్లో ఫలితం తెలిసి పోతుంది. అంటే ఒకే రోజులో నిర్ధారణతోపాటు చికిత్స ప్రారంభించవచ్చు. దీంతో ల్యాబ్ లేదా రవాణా అవసరం లేదు.
నిజానికి హెపటైటిస్ సి వైరస్ (HCV) ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మందిని ప్రభావితం చేస్తోంది. ప్రతీ సంవత్సరం సుమారు 2.42 లక్షల మంది మరణాలకు కారణం అవుతుంది. ముఖ్యంగా లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్లకు దారితీస్తుంది. అయితే 8 నుంచి 12 వారాలు మెడికేషన్స్ యూజ్ చేస్తే ఈ వైరస్ సంపూర్ణంగా దూరం అవుతుంది. కానీ టెస్టింగ్ ప్రాసెస్ వల్ల గుర్తించడమే ఆలస్యమయ్యేది. దీంతో చాలామందిలో చికిత్స ప్రారంభించే సమయానికి హెచ్‌సీవీ అధికమై ఇబ్బందులు తలెత్తేవి. కొన్నిసార్లు మరణాలు సంభవిస్తాయి కూడా. కానీ ఇప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే హెసీవీ టెస్ట్ పూర్తి చేసే విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు కాబట్టి ఆ వ్యాధివల్ల సంభవించే మరణాల రేటు 2030 నాటికి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
































