ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలవబోతుంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అధికారం చేపట్టి తీరాలని టీడీపీ-జనసేన కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తుండగా..టార్గెట్ 175 అంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది.
అయితే ఒకప్పుడు టీడీపీ స్కూల్ లోనే రాజకీయ పాఠాలు నేర్చిన ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..తన మాజీ బాస్ చంద్రబాబుకి పరోక్షంగా సహకరించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు కనబడుతున్నాయి. దీనికి కారణం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నీటి జలాల వివాదంలో సీఎం జగన్ ను డైరెక్ట్ గా ఎటాక్ చేయడమే.
రేవంత్ రెడ్డి సీఎం అయి దాదాపు 2 నెలలు కావొస్తుంది. అయితే ఏపీ సీఎం జగన్ కనీసం తనకు ఫోన్ చేసి అభినందనలు తెలపలేదని రేవంత్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి చూస్తే..రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబు మనిషే అని జగన్ భావిస్తున్నాడని..అందుకే రేవంత్ రెడ్డికి ఆయన దూరంగా ఉంటున్నట్లు అర్థమవుతోంది. అయితే సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేరుగా జగన్ పేరు ప్రస్తావించి కామెంట్ చేయని రేవంత్ రెడ్డి..మరికొద్ది రోజుల్లో ఏపీ ఎన్నికలు జరుగున్న ఈ సమయంలో జగన్ పై డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. అది కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు. గతేడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఒకరోజు ముందు తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఏపీ పోలీసుల సాయంతో జగన్ ఆక్రమించుకోవాలనుకుంటే కేసీఆర్ మారు మాట్లాడలేదని విమర్శించారు. దమ్ముంటే ఇప్పుడు రావాలని జగన్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
గతంలో వైఎస్ఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయారని,ఆయన తనయుడు జగన్… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు తిన్నారని, కృష్ణా నీటిపై దాదాపు 6 గంటల పాటు చర్చించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుమతి తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యల వెనుక రెండు వ్యూహాలు ఉన్నట్లు కనబడుతోంది. మొదటిది.. జగన్ తో కుమ్మక్కై తెలంగాణ నీటి జలాల విషయంలో కేసీఆర్ అన్యాయం చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా మరికొద్ది రోజుల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో లాభపడటం..మరొకటి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ-కాంగ్రెస్ కూటమి ఓడిపోవడం..టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్)అధికారంలోకి రావడం కోసం జగన్ ప్రయత్నించాడన్న ఆరోపణలున్న నేపథ్యంలోె అప్పుడు తమ ఓటమికి కారణమైన జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి ఆలోచనలాగా కనబడుతున్నది. అందులో భాగంగానే జగన్ పై డైరెక్ట్ ఎటాక్ మొదలుపెట్టి ఏపీ-తెలంగాణ మధ్య స్నేహాకపూర్వక వాతావరణం ఉండాలంటే చంద్రబాబు సీఎం అయితేనే సాధ్యం అనే రీతిలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నట్లు కనబడుతోంది. జగన్ మళ్లీ ఏపీలో గెలిచి సీఎం అయితే తెలంగాణ-ఆంధ్ర మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుందనే ఆలోచనను ప్రజల ముందుంచే వ్యూహంగా రేవంత్ రెడ్డి తాజాగా జగన్ పై ఎటాక్ చేయడం తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి దూకుడు ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకి కలిసి వస్తుందా?లేదా అన్న విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.
ఇక,ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండి.. కాంగ్రెస్ కు అనధికారిక మద్దతు ఇఛ్చిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే టీడీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. అయినప్పనటికి టీడీపీ మద్దతు తమకు కలిసివచ్చిందని..తమ విజయంలో టీడీపీ పాత్ర మరువలేనిదని కాంగ్రెస్ మంత్రులు,నేతలు బహిరంగంగానే అంటున్నారు. దీంతో గత ఎన్నికల్లో తమకు అండగా ఉన్న టీడీపీ రుణం తీర్చుకోవాలని రేవంత్ రెడ్డి మనసులో ఉన్నట్లు తాజాగా జగన్ పై ఎటాక్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. రేవంత్ రెడ్డి తీర్చుకుంటారని..జగన్ పై బాణం ఎక్కుపెట్టి తమకు మేలు చేస్తాడని టీడీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నారు.