ఆ ట్యాబ్లెట్స్‌తో గుండె ఆగిపోయే ప్రమాదం.. పరిశోధనలో షాకింగ్ విషయాలు

మారిన కాలంతో పాటు వ్యాధులు కూడా మారుతున్నాయి. శారీరక వ్యాధులకు బదులుగా మానసిక వ్యాధులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా డిప్రెషన్‌ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నారు.


దీంతో యాంటీ డిప్రెషన్‌ మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో ఈ మందులను ఉపయోగించడం వల్ల శరీరంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..

తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం ఎక్కువ కాలం యాంటిడిప్రెసెంట్స్ తీసుకునే వ్యక్తులకు గుండె ఆగిపోవడం లేదా ఇతర గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిరాశ అనేది ఒక సాధారణ సమస్యగా మారుతోంది. దీనిని నివారించడానికి, లక్షలాది మంది యాంటిడిప్రెసెంట్ల సహాయం తీసుకుంటారు. ఎక్కువ కాలం డిప్రెషన్ మందులు తీసుకోవడం వల్ల మీ గుండెపై ప్రమాదకరమైన ప్రభావం పడుతుంది.

యాంటిడిప్రెసెంట్స్‌ను దీర్ఘకాలికంగా వాడటం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. ఇది అకాల మరణానికి దారితీస్తుంది. డెన్మార్క్‌లో 4.3 మిలియన్ల మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో కనీసం 1 నుంచి 5 సంవత్సరాల పాటు యాంటిడిప్రెసెంట్స్ తీసుకున్న వారిలో ఆకస్మికంగా గుండె ఆగిపోయే ప్రమాదం 56% ఎక్కువగా ఉందని తేలింది. అదే సమయంలో ఈ మందులను 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల ప్రమాదం 2.2 రెట్లు పెరుగుతుంది.

అధ్యయనం ప్రకారం 1 నుం 5 సంవత్సరాల పాటు యాంటిడిప్రెసెంట్స్ తీసుకున్న 30 నుండి 39 సంవత్సరాల వయస్సు గల వారిలో మందులు తీసుకోని వారి కంటే ఆకస్మిక గుండెపోటు వచ్చే ప్రమాదం దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఔషధం తీసుకునే వారిలో ప్రమాదం 5 రెట్లు పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. 1 నుంచి 5 సంవత్సరాల పాటు యాంటిడిప్రెసెంట్స్ తీసుకున్న 50 నుంచి 59 సంవత్సరాల వయస్సు గలవారిలో ఆకస్మిక గుండెపోటు ప్రమాదం రెట్టింపు అయింది. అదే సమయంలో, 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఔషధం తీసుకునే వారికి ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ రిగ్‌షోస్పిటలెట్ హార్ట్ సెంటర్‌కు చెందిన డాక్టర్ జాస్మిన్ ముజ్కనోవిక్ మాట్లాడుతూ, యాంటిడిప్రెసెంట్స్‌ను ఎంత ఎక్కువసేపు తీసుకుంటే, ఆకస్మిక గుండెపోటు ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని అన్నారు. 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈ ఔషధాన్ని తీసుకునే వ్యక్తులకు ఎక్కువ ప్రమాదం ఉందని ఆయన అన్నారు. 39 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో, గుండె కండరాలు గట్టిపడటానికి సంబంధించిన సమస్యల కారణంగా ఈ సమస్య తరచుగా సంభవిస్తుందని పరిశోధకులు అంటున్నారు. వృద్ధులలో, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు ఇరుకుగా మారడం ప్రధాన కారణంగా చెబుతున్నారు.