నెలకు రూ.10 వేలతో రూ.26 లక్షలు.. LIC నుంచి కొత్త సేవింగ్స్‌ ప్లాన్

ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) కొత్త సేవింగ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది.


నవ జీవన్‌ శ్రీ, నవ జీవన్‌ శ్రీ- సింగిల్‌ ప్రీమియం పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండూ నాన్‌ పార్టిసిపేటింగ్‌, నాన్‌ లింక్డ్‌, లైఫ్‌, ఇండివిడ్యువల్‌ సేవింగ్‌ ప్లాన్స్‌. నేటి నుంచి (జులై 4) వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎల్‌ఐసీ పేర్కొంది. తమ పెట్టుబడికి భద్రత, వడ్డీతో పాటు బీమా కవరేజీ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్లు అనువుగా ఉంటాయని సంస్థ చెబుతోంది.

ఎల్‌ఐసీ నవ జీవన్‌ శ్రీ- సింగిల్‌ ప్రీమియం (ప్లాన్‌ నం.911)

  • ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకొనే వారి కోసం ఎల్‌ఐసీ ఈ సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌ను తీసుకొచ్చింది.
  • ఈ పాలసీ చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. 30 రోజుల నుంచి 60 ఏళ్ల (ఆప్షన్‌-2లో 40 ఏళ్లు) వయసు నిండిన వారి పేరిట ఈ పాలసీ కొనుగోలు చేయొచ్చు.
  • మెచ్యూరిటీకి కనిష్ఠ వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయసు 75 ఏళ్లు (ఆప్షన్‌-2లో 60ఏళ్లు)గా నిర్ణయించారు.
  • కనీస పాలసీ వ్యవధి 5 ఏళ్లు, గరిష్ఠంగా 20 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస హామీ మొత్తాన్ని (సమ్‌ అష్యూర్డ్‌)రూ.1 లక్షగా ఎల్‌ఐసీ పేర్కొంది. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు.
  • ఆప్షన్‌-1 కింద డెత్‌ బెన్‌ఫిట్‌ కింద సింగిల్‌ ప్రీమియానికి 1.25 రెట్లు లేదా బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌లో ఏది ఎక్కువైతే అది లభిస్తుంది. ఆప్షన్‌-2 కింద సింగిల్‌ ప్రీమియానికి 10 రెట్లు రిస్క్‌ కవరేజీ ఉంటుంది.
  • మీరు చేసిన పెట్టుబడికి గ్యారెంటీ అడిషన్‌ జోడిస్తారు. ప్రతి వెయ్యి రూపాయలకు రూ.85 చొప్పున గ్యారెంటీ అడిషన్‌ జోడిస్తారు. పాలసీ చెల్లుబాటులో ఉన్నంత కాలం ఆ మొత్తం లభిస్తుంది.
  • ఎల్‌ఐసీ యాక్సిడెంట్‌ డెత్‌ అండ్‌ డిజేబిలిటీ రైడర్‌, న్యూటర్మ్‌ అష్యూరెన్స్‌ రైడర్‌ వంటివి జోడించుకోవచ్చు.
  • మెచ్యూరిటీ మొత్తం లేదా పాలసీ హోల్డర్‌కు రిస్క్‌ జరిగినా ఎల్‌ఐసీ నుంచి వచ్చే మొత్తాన్ని ఒకేసారి లేదా నెల/ మూడు నెలలు/ ఆరు నెలలు/ వార్షిక ప్రాతిపదికన తీసుకోవచ్చు.

ఈ పాలసీని ఒక ఉదాహరణతో చూద్దాం.. 18 ఏళ్ల వయసున్న A అనే వ్యక్తి ఐదేళ్ల పాలసీ కాలానికి రూ.5 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకున్నారనుకుందాం. ఆప్షన్‌-1 కింద సింగిల్‌ ప్రీమియం కింద అంటే ఒకేసారి రూ.5,39,325 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.42,500 చొప్పున గ్యారెంటీ అడిషన్‌గా లభిస్తుంది. అలా ఐదేళ్ల కాలానికి రూ.2.12 లక్షలు వస్తుంది. ఐదో ఏడాది సమ్‌ అష్యూర్డ్‌+ గ్యారెంటీ అడిషన్‌ కలిపి మెచ్యూరిటీ కింద రూ.7,12,500 లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాలంలో రిస్క్‌ జరిగితే గరిష్ఠంగా రూ.9.17 లక్షలు ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. అంటే మీ పెట్టుబడికి వడ్డీతో పాటు బీమా కవరేజీ కూడా లభిస్తుందన్నమాట.

ఎల్‌ఐసీ నవ జీవన్‌ శ్రీ (ప్లాన్‌ నం.912)

  • ఎల్‌ఐసీ జీవన్‌ శ్రీ పేరుతో తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ఇది. ఒకసారి కాకుండా విడతల వారీగా చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
  • ఈ పాలసీకి రూ.5 లక్షలు మినిమమ్‌ సమ్‌ అష్యూర్డ్‌గా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు.
  • ఈ ప్లాన్‌లో చేరాలంటే కనీస వయసు 30 రోజులు, గరిష్ఠ వయసు 75 ఏళ్లుగా నిర్ణయించారు. మెచ్యూరిటీకి 18 ఏళ్లు, గరిష్ఠ వయసు 75 ఏళ్లుగా నిర్ణయించారు.
  • 6, 8, 10, 12 ఏళ్ల ప్రీమియం చెల్లింపు వ్యవధితో ఈ పాలసీ లభిస్తుంది. మీరెంచుకున్న కాలవ్యవధి ఆధారంగా ప్రీమియం మొత్తం ఆధారపడి ఉంటుంది.
  • పాలసీ టర్మ్‌ను కనీసం 10 ఏళ్లుగా నిర్ణయించారు. ఆపై 15, 16, 20 ఏళ్లు.. ఇలా మీ అవసరాలకు అనుగుణంగా పాలసీ టర్మ్‌ను ఎంచుకోవచ్చు.
  • పాలసీ టర్మ్‌ను బట్టి గ్యారెంటీడ్‌ అడిషన్స్‌ లభిస్తాయి. 10-13 ఏళ్ల కాలానికి 8.50%, 14-17 ఏళ్ల కాలానికి 9%, 18-20 ఏళ్ల కాలవ్యవధిపై 9.50% చొప్పున గ్యారెంటీడ్‌ అడిషన్స్‌ అందిస్తారు.
  • ఇందులో కూడా ఆప్షన్‌-1, ఆప్షన్‌-2 ఉంటాయి. ఆప్షన్‌ 1 కింద కనీస హామీ మొత్తం+ వార్షిక ప్రీమియానికి 7 రెట్లు (ఏది ఎక్కువైతే అది) డెత్‌ బెన్‌ఫిట్‌ కింద లభిస్తాయి. ఆప్షన్‌-2 కింద వార్షిక ప్రీమియానికి 10 రెట్లు+ బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌ లభిస్తాయి.
  • ఎల్‌ఐసీ యాక్సిడెంటల్‌ డెత్‌ అండ్‌ డిజేబిలిటీ బెన్‌ఫిట్‌ రైడర్‌, యాక్సిడెంట్‌ బెన్‌ఫిట్‌ రైడర్‌, న్యూటర్మ్‌ అష్యూరెన్స్‌ రైడర్‌, ప్రీమియం వెయివర్‌ బెన్‌ఫిట్‌ రైడర్‌ను జోడించుకోవచ్చు.
  • నెలవారీ, మూడు నెలలకు, ఆరు నెలలకు, వార్షిక ప్రాతిపదికన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు లభిస్తాయి.

ఈ పాలసీ ప్రయోజనాలను ఉదాహరణతో చూద్దాం.. A అనే వ్యక్తి రూ.10 లక్షల సమ్‌ అష్యూర్డ్‌ మొత్తంతో 20 ఏళ్ల పాలసీ టర్మ్‌కు పాలసీ తీసుకున్నారనుకుందాం. ఆప్షన్‌-2, 10 ఏళ్లు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే ఏడాదికి రూ.1,10,900 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ అయితే రూ.10వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్ల కాలానికి చెల్లించే మొత్తం రూ.11,09,000 (రూ.11లక్షలు) అవుతుంది. పాలసీ టర్మ్‌ 20 ఏళ్లు కాబట్టి రూ.16,58,786 గ్యారెంటీడ్‌ అడిషన్స్‌ (9 శాతం చొప్పున) కింద లభిస్తాయి. మొత్తంగా మెచ్యూరిటీ మొత్తం కింద రూ.26,58,787 (చెల్లించిన మొత్తం+ గ్యారెంటీడ్‌ అడిషన్స్‌) లభిస్తుంది. పాలసీ సమయంలో ఏదైనా రిస్క్‌ జరిగితే బీమా కూడా లభిస్తుంది.

Note: ప్రీమియం మొత్తాలు ఒక అంచనా మాత్రమే. ఎంచుకున్న వయసు, రైడర్లు ఆధారంగా కొంత మార్పు ఉంటుంది. ఈ పాలసీలకు సంబంధించిన మరిన్ని వివరాలకు మీ ఏజెంట్లు లేదా ఎల్‌ఐసీ కార్యాలయం/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.