అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండో విడత అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ఈరోజు (సోవారం) సమీక్ష నిర్వహించారు.
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులను కేంద్రం విడుదల చేయనుంది.
ఈ నెల 19న వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే.. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్‌పీసీఏలో ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత 46,62,904 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతలో రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు మొత్తం రూ .7 వేలు అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లోకి జమకానున్నాయి. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద రూ.3077.77 కోట్లు రైతుల ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి.



































