నెలకు రూ. 37తో రూ. 2లక్షల బీమా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

www.mannamweb.com


పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉండవు. ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలీదు. ఈక్షణం కనిపించిన వారు.. మరు క్షణంలో మాయమైపోయే జీవితాలు మనవి.

ఇలాంటి పరిస్థితుల్లో మనపై ఆధారపడిన వ్యక్తుల భద్రత చాలా కీలకం. అనుకోని సంఘటనలో మనకేదైనా జరిగితే.. మనపై ఆధారపడిన వారు ఆర్థికంగా కుదేలైపోతారు. వారు బతకడం కూడా కష్టమైపోతుంది. అందుకే జీవిత బీమా(లైఫ్ ఇన్సురెన్స్)కి ప్రాధాన్యం పెరుగుతోంది. అందరూ ఏదో ఒక సంస్థలో చిన్న మొత్తంలో అయిన జీవిత బీమా తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు కూడా కొన్ని బీమా పాలసీలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన(పీఎంజేజేబీవై)పేరుతో ఓ పథకాన్ని నిర్వహిస్తోంది. ఇది దేశంలో ఆర్థిక భద్రతను పెంపొందించడానికి తీసుకొచ్చిన పథకం. దీనిలో ఖాతా ఎలా ప్రారంభించాలి? ప్రధాన ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..

పీఎంజేజేబీవై పథకం ఇది..

సరసమైన ప్రీమియంతో వ్యక్తులకు జీవిత బీమా కవరేజీని అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన(పీఎంజేజేబీవై)ని 9 మే, 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది ఒక-సంవత్సరం జీవిత బీమా పథకం. ఏ కారణం చేతనైనా బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే కవరేజీని నామినీకి అందిస్తుంది.

పీఎంజేజేబీవై అర్హత..

సేవింగ్స్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతా కలిగి ఉన్న 18-50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు పథకం కింద నమోదు చేసుకోవడానికి అర్హులు. 50 ఏళ్లు పూర్తి కాకుండానే పథకంలో చేరిన వ్యక్తులు ప్రీమియం చెల్లించిన తర్వాత 55 ఏళ్ల వయస్సు వరకు బీమాని కొనసాగించవచ్చు.

పీఎంజేజేబీవై ప్రయోజనాలు..

ఏదైనా కారణం వల్ల బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే రూ. 2 లక్షల జీవిత బీమా వస్తుంది. పథకంలో 30-రోజుల తాత్కాలిక లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే దీని ద్వారా నమోదు చేసుకున్న తేదీ నుంచి మొదటి 30 రోజులలో ఏవైనా సంఘటనలో వ్యక్తి మరణిస్తే ఆ క్లెయిమ్ లు చెల్లించరు. అయితే ఏదైనా రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు సంభవిస్తే మాత్రం ఇది 30 రోజుల లాకిన్ పీరియడ్ వర్తించదు.

ప్రీమియం ఎంతంటే..

ఈ పథకంలో వార్షిక ప్రీమియం వసూలు చేస్తారు. ఇది ప్రతి ఏడాది మే నెల 31తేదీలోపు మీరు ఎంచుకున్న ఆప్షన్ ఆధారంగా మీ సేవింగ్స్ ఖాతాను ఆటో డెబిట్ అవుతుంది. దీని ప్రీమియం ఏడాది రూ. 436. ఏటా ఇది మీ సేవింగ్స్ ఖాతా నుంచి ఒకేసారి డెబిట్ అవుతుంది.

పీఎంజేజేబీవై నమోదు ఇలా..

ఈ పథకం కింద ఎన్‌రోల్‌మెంట్‌లను ఖాతాదారుడి బ్యాంక్ బ్రాంచ్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా చేసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా కూడా చేసుకోవచ్చు. ఖాతాదారుడి నుంచి వన్-టైమ్ మ్యాండేట్ ఆధారంగా ఈ పథకం కింద ప్రీమియం ఏటా చందాదారుల బ్యాంక్ ఖాతా నుంచి ఆటో-డెబిట్ అవుతుంది.