సంక్రాంతి ప్రయాణాల వేళ బిగ్ న్యూస్. ఆర్టీసీ సంక్రాంతి కోసం పెద్ద సంఖ్యలో ఇప్పటికే స్పెషల్ బస్సులను ప్రకటించింది. ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించిన స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు సైతం ఉండవని ప్రకటించారు.
రూట్లు.. షెడ్యల్ ఫిక్స్ చేసారు. అయితే, ఇదే సమయంలో షాకింగ్ ప్రక టన వచ్చింది. ఆర్టీసీలోని 2,419 అద్దె బస్సులు ఈ నెల 12 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు ప్రకటించారు. మహిళల ఉచిత ప్రయాణం తో పడిన అదనపు భారం మేరకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీఎస్ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానుల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి బస్సులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లోని ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఈ రోజు నోటీసు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమలు చేస్తోంది.
ఈ పథకం వచ్చిన తరువాత బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు ఒక్కో బస్సుకు నెలకు రూ 15 వేల నుంచి రూ 20 వేలు అదనంగా చెల్లించాలని కొంత కాలంగా ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ఈ విషయం పై తాజాగా ఆర్టీసీ అధికారులు చర్చలు చేసారు. ఒక్కో బస్సుకు నెలకు రూ 5,200 చొప్పున చెల్లించేలా సర్క్యులర్ జారీ చేసారు.
ఈ చెల్లింపు నిర్ణయం పైన ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంత పెంచుతున్నారో తమకు చెప్పకుండా సర్క్యులర్ జారీ చేసారని ఆరోపిస్తూ. సమ్మె కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కాగా, ఆర్టీసీ లో 2,700 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్న పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి. ఇప్పటికే ప్రకటించిన విధంగా సమ్మెకు వెళ్తే ఈ నెల 12 నుంచి ఈ బస్సులు నిలిచి పోనున్నాయి.
సమ్మె జరిగితే సంక్రాంతి పండుగ వేళ ఈ నిర్ణయం ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే.. ఆర్టీసీ అధికారులు అద్దె బస్సుల యజమానులతో చర్చించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అద్దె బస్సులు ఎక్కువగా పట్టణ.. గ్రామీణ ప్రాంతాల పరిధిలో సేవలు అందిస్తున్నాయి. సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే వారికి ఈ బస్సులు నిలిచిపోతే సమస్యలు తప్ప వనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో.. ఇప్పుడు ఆర్టీసీ తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొంది.




































