మహాలక్ష్మీ పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వం ఈ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం వినియోగించుకుంటున్నారు. ఉచిత బస్సు పథకం రెండేళ్లు పూర్తి చేసుకుంది.
ఇదే సమయంలో గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ ప్రయాణీకుల కోసం తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను విస్తరించాలని డిసైడ్ అయ్యారు. ఆ బస్సుల్లోనూ క్రమేణా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే ఆలోచన చేస్తున్నారు. గ్రేటర్ పరిధి లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసి.. 8459 కోట్ల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం పైన తొలి రోజుల్లో కొన్ని సమస్యలు వచ్చినా.. ఆ తరువాత వినియోగం భారీగా పెరిగింది. ఈ సమయంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేయాల ని నిర్ణయించింది. కాగా, గ్రేటర్‌లో బుధవారం కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ డిపోలో ప్రారంభిస్తున్నారు. కాగా.. గ్రేటర్‌లో రెండేళ్లలో మొత్తం 2,800 ఎలక్ర్టిక్ బస్సులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రేటర్‌లో ఇప్పటికే 297 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ పలు రూట్లలో నడుపుతోంది. రాణిగంజ్ డిపోకు వచ్చిన 65 ఈవీలతో వాటి సంఖ్య 362కు చేరనుంది. జనవరి, ఫిబ్రవరి నాటికి గ్రేటర్‌కు మరో 178 ఎలక్ర్టిక్ బస్సులు వస్తాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కూకట్‌పల్లి బస్‌డిపోను ఈవీబస్ డిపోగా మార్చే దిశగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రికల్ బస్సులను డిపోల వారీగా కేటాయించారు. హెచ్‌సీయూ 90, హయత్‌నగర్ 65, కంటోన్మెంట్ 66, మియా పూర్-2 76, , రాణిగంజ్ 65 కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా బస్సుల్లో పథకం అమలు పైన సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. కాగా, మహిళలు ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి ఉచిత ప్రయాణం వినియోగించుకుంటున్నారు. త్వరలోనే ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశ పెడుతోంది. దీని ద్వారా ఈ కార్డులతోనే మహిళలు ఉచిత ప్రయాణం చేసే అవకాశం అందుబాటులోకి రానుంది.

































