ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. కెప్టెన్ కె తిమ్మప్పయ్య మెమోరియల్(KSCA) ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్ లో దుమ్మురేపాడు. అతడి బౌలింగ్ దాటికి ప్రత్యర్థి బ్యాటర్లు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. ఇక ఈ టోర్నీలో గోవాకు అర్జును ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా.. లేటెస్ట్ గా కర్ణాటకతో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అర్జున్ పేస్ బౌలింగ్ ముందు కర్ణాటక ప్లేయర్లు నిలవలేకపోయారు. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
KSCA ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్ లో సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్ చెలరేగిపోయాడు. తన పదునైన పేస్ బౌలింగ్ తో జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో భాగంగా గోవాకు ఆడుతున్న అర్జున్.. ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 9 వికెట్లతో ఘనత వహించాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టగా.. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లతో సత్తాచాటాడు. ఓవరాల్ గా 26.3 ఓవర్లు వేసి 87 రన్స్ ఇచ్చి 9 వికెట్లు నేలకూల్చాడు. అర్జున్ బౌలింగ్ దాటికి కర్ణాటక బ్యాటర్లు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. కొద్దిసేపు కూడా క్రీజ్ లో నిలవలేకపోయారు. సచిన్ కొడుకు అద్భుతమైన బౌలింగ్ చేయడంతో.. ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో గోవా టీమ్ ఘన విజయం సాధించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్ లో 103 పరుగులకు ఆలౌట్ కాగా.. అర్జున్ 13 ఓవర్లు వేసి 41 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం గోవా తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 413 పరుగులు చేసింది. అభినవ్ తేజ్ రానా(109) సెంచరీతో కదం తొక్కాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా కర్ణాటక బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. దాంతో 121 రన్స్ కే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా అర్జున్ బౌలింగ్ ను ఆడలేకపోయిన కర్ణాటక టీమ్ ఓడిపోయింది. కాగా.. ఇప్పటి వరకు సీనియర్ లెవెల్లో 49 మ్యాచ్ లు ఆడి.. 68 వికెట్లు పడగొట్టాడు. అలాగే 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 21 వికెట్లు తీశాడు.