ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన భారీ సైన్స్ ఫిక్షన్-మైథాలజీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వినీదత్ నిర్మించారు. 2024 జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
ఈ మూవీ విడుదల సమయంలోనే మేకర్స్ సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ 2’ను అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సీక్వెల్‌లో దీపికా పదుకోన్ భాగం కావడం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. దీంతో కథలో కీలకమైన సుమతి పాత్రను ఎవరు పోషించనున్నారన్న అంశం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఈ పాత్ర కోసం ఇప్పటికే ఆలియా భట్, ప్రియాంకా చోప్రా లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించగా.. తాజాగా సాయిపల్లవి పేరు తెరపైకి వచ్చింది. ఎమోషనల్ డెప్త్ ఎక్కువగా ఉండే ఈ పాత్రకు సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే సాయిపల్లవి అయితేనే బెస్ట్ అని మేకర్స్ ఫిక్సయినట్లు సమాచారం. కాకపోతే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. సో, సాయిపల్లవి నిజంగానే ‘కల్కి 2’లో భాగమవుతారా? అన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, ఈ సీక్వెల్ కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి తొలి వారంలో ప్రారంభం కానుందని, ఇందులో ప్రభాస్ కూడా పాల్గొననున్నారని సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

































