నగరంలో సంక్రాంతి వేడుకలు(Sankranthi celebrations) సంబురంగా ప్రారంభమయ్యాయి.
మూడు రోజుల పండుగలో బుధవారం ఉదయం కాలనీలు, అపార్ట్మెంట్లలో భోగి మంటలు వేశారు. ఇంట్లోని పాత చెక్క వస్తువులను భోగి మంటల్లో కాల్చి, నూతన ఆరంభాలకు శ్రీకారం చుట్టారు. సంక్రాంతి సంబురం నగరంలో ఏముంటుంది? గ్రామాల్లోనే ఆ సందడంతా అంటూ చాలామంది పండుగ కోసం గ్రామాలకు వెళ్లిపోయారు కానీ, నగరంలో ఉన్న వారు ఆ పండుగ స్ఫూర్తిని కొనసాగించడానికి తాపత్రయపడటం కనిపించింది.
యువత సైతం ఇందులో భాగస్వామవడం మంచి పరిణామం. ఇక సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా సంక్రాంతి పండుగ విశిష్టతను గొప్పగా చెబుతూ సందేశాలు, ఫొటోలు పంపడం కనిపించింది. భోగి మంటలు వేయడం, పతంగులు ఎగురవేయడం వంటి వాటితో యువత బిజీగా గడిపారు. టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయే తమ పిల్లలు పండుగ పేరిట ఇలా బయట తిరగడం చాలా ఆనందంగా ఉందని కొంతమంది తల్లిదండ్రులు చెప్పారు.




































