సంపదను సృష్టించడం అంటే కేవలం రిస్క్ ఉన్న స్టాక్ మార్కెట్లలోనో.. లేదా మరెక్కడో పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు. క్రమశిక్షణతో కూడిన చిన్న చిన్న సేవింగ్స్ కూడా భవిష్యత్తులో కొండంత అండగా నిలుస్తాయి.
అందుకు చక్కని ఉదాహరణే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. కేవలం రోజుకు 200 రూపాయల సేవ్ చేస్తే 10 లక్షల రూపాయల నిధిని ఎలా సమకూర్చుకోవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
చిన్న పొదుపు – పెద్ద మొత్తం:
ఈ స్కీమ్ ప్రధాన బలం క్రమశిక్షణ. మీరు రోజుకు రూ.200 సేవ్ చేస్తే.. నెలకు రూ.6వేలు అవుతుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇది పెద్ద భారం అనిపించదు. 2026లో అందిస్తున్న వడ్డీ రేట్ల ప్రకారం పోస్టాఫీస్ RD పై ప్రభుత్వం 6.7% వడ్డీని క్వార్టర్లీ కాంపౌండింగ్ లెక్కన అందిస్తోంది. దీనికి ప్రభుత్వం ఫుల్ గ్యారెంటీ ఇస్తోంది కాబట్టి డబ్బుకు భద్రత ఉంటుంది.
వాస్తవానికి పోస్టాఫీస్ RD ప్రాథమికంగా 5 ఏళ్ల కాలపరిమితితో ఉంటుంది. మీరు నెలకు రూ.6వేలు చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.3లక్షల 60వేలు డిపాజిట్ చేస్తే.. వడ్డీతో కలిపి సుమారుగా రూ.4లక్షల 28వేలు 60 నెలల తర్వాత చేతికి అందుతాయి. కావాలనుకుంటే మరో 5 ఏళ్లు పొడిగించే వెసులుబాటు స్కీమ్ అందిస్తోంది. అంటే మొత్తం 10 ఏళ్ల పాటు మీరు పొదుపును కొనసాగిస్తే.. మీ పెట్టుబడి రూ.7లక్షల 20వేలు అవుతుంది. దీనిపై వచ్చే చక్రవడ్డీతో కలిపి 10 ఏళ్లు గడిచే నాటికి రూ.10.25 లక్షల భారీ నిధి ఒక్కగారిగా అందుదతుంది.
ఇందులో మరో అద్భుతమైన ఫీచర్ ఉంది. మీరు ఖాతా తెరిచిన ఏడాది తర్వాత.. మీ డిపాజిట్ మొత్తంలో 50% వరకు రుణంగా తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ అప్పుపై వడ్డీ రేటు కూడా RD వడ్డీ కంటే కేవలం 2% మాత్రమే ఎక్కువ.
ఖాతా ఎవరు తెరవవచ్చు..?
18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడు ఎవరైనా తమకు దగ్గరలోని పోస్టాఫీసులో ఈ ఖాతా తెరవవచ్చు. ముగ్గురు పెద్దలు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. కేవలం రూ.100 తో ప్రారంభించి.. ఆపై మీకు నచ్చిన మొత్తాన్ని పొదుపు చేసుకోవచ్చు. ఒకవేళ పొదుపు చేసే వ్యక్తి మధ్యలోనే మరణిస్తే.. నామినీ ఆ సొమ్ము అందుతుంది. ఇది రాబడి పరంగా తక్కువగానే ఉన్నప్పటికీ ఒక ఆర్థిక భరోసాను కలిగించటంలో మాత్రం పెద్దదిగా చెప్పుకోవచ్చు చిన్న కుటుంబాలకు.



































