SBI: ఎస్‌బీఐ అదిరే గుడ్‌న్యూస్.. అమృత్ కలశ్ స్కీమ్ గడువు మళ్లీ పొడిగింపు.. రూ. 5 లక్షలకు ఎంతొస్తుంది?

www.mannamweb.com


SBI Extends Amrit Kalash FD: ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో చాలా మందికి తమ సంపాదనలో నుంచి ఎంతో కొంత ఆదా చేసి.. దీనిని దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. దాని కోసం పెద్దగా రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ వచ్చే పెట్టుబడి సాధనాలవైపు చూస్తుంటారు. వీటిల్లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. కొంతకాలంగా కస్టమర్లకు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బంపర్ రిటర్న్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే.. చాలా బ్యాంకులు FD పై అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు రెగ్యులర్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తూ.. స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్ని కూడా లాంఛ్ చేస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం గురించి
ఈ అమృత్ కలశ్ స్పెషల్ ఎఫ్‌డీ పథకాన్ని ఎస్‌బీఐ 2023 ఏప్రిల్ 12న లాంఛ్ చేసింది. ఈ డిపాజిట్ టెన్యూర్ 400 రోజులుగా ఉంది. ఇటీవల మార్చి 31న గడువు ముగియగా.. తాజాగా బ్యాంక్ శుభవార్త చెప్పింది. గడువును మరోసారి పొడిగించింది. ఇప్పుడు 2024, సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ కోరుకునే వారికి మరో 6 నెలల సమయం ఇచ్చిందన్నమాట.

అంతకుముందు కూడా పలుమార్లు గడువులు ముగియగా.. వరుసగా నాలుగోసారి గడువు పొడిగిస్తూ వచ్చింది. మొదటగా 2023, జూన్ 23 వరకు.. తర్వాత ఆగస్ట్ 15 వరకు.. మళ్లీ డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించగా.. చివరగా మార్చి 31 వరకు ఈ స్కీం కొనసాగించింది. ఇప్పుడైతే ఏకంగా మరో 6 నెలలు పొడిగించడం విశేషం.

ఈ స్కీం గురించి చూసినట్లయితే 400 రోజుల డిపాజిట్. డొమెస్టిక్ రిటైల్ టర్మ్ డిపాజిట్లకు అవకాశం ఉంటుంది. NRI రూపీ టర్మ్ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు మాత్రమే డిపాజిట్‌కు అవకాశం ఉంది. కొత్త, రెనివల్ డిపాజిట్లకు ఛాన్స్ ఉంది. ఈ స్కీం కిందే SBI డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తోంది. దీంట్లో రెగ్యులర్ సిటిజెన్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.60 శాతం వడ్డీ అందిస్తోంది. దీంట్లో లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. నేరుగా బ్రాంచుకు వెళ్లి ఎఫ్‌డీ తెరవొచ్చు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో ఛానెల్స్ ద్వారా కూడా ఇందులో చేరే అవకాశం ఉంది.

రూ. 5 లక్షల డిపాజిట్‌పై ఎంతొస్తుందంటే?
ఇప్పుడు ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకంలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి అంటే 400 రోజులకు ఎంత రిటర్న్స్ వస్తాయో తెలుసుకుందాం. రెగ్యులర్ సిటిజెన్లకు 7.10 శాతం వడ్డీ రేటు లెక్కన రూ. 38,834 వడ్డీ అందుతుంది. మొత్తం చేతికి మెచ్యూరిటీ సమయంలో రూ. 5,38,834 అందుతుంది. ఇదే సీనియర్ సిటిజెన్లకు అయితే 7.60 శాతం వడ్డీ రేటు కింద 5 లక్షల డిపాజిట్‌పై రూ. 41,569 పొందుతారు.