తనకు తానుగా నాశనమయ్యే ప్లాస్టిక్‌

ప్లాస్టిక్స్‌ తమను తాము నాశనం చేసుకునే విధంగా ప్రోగ్రామ్‌ చేయగలిగే విధానాన్ని రట్గర్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.


దీని కోసం కొత్తగా రసాయనాలను వాడవలసిన అవసరం లేదు. పాలిమర్‌ అణువులను మడత పెట్టడం ద్వారా దీనిని సాధించారు. ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఉండటానికి కారణం ఏమిటంటే, ప్రస్తుత ప్లాస్టిక్స్‌ను అత్యధిక మన్నిక కలవిగా డిజైన్‌ చేయడమే. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్లు వంటి ప్రకృతి సహజ పాలిమర్స్‌ శాశ్వత మన్నిక కలవి కాదు. ఇవి తమ పని తాము చేసి, సహజంగానే క్షీణిస్తాయి. పరిశోధకులు దీని నుంచి ప్రేరణ పొందారు. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్ల మాదిరిగానే సింథటిక్‌ ప్లాస్టిక్స్‌లో కూడా జీవితాన్ని అంతం చేసుకునే ఏర్పాట్లను అంతర్గతంగా ఎలా ప్రవేశపెట్టాలి? అనే అంశంపై దృష్టి సారించారు.

సహజ పాలిమర్స్‌ అంతర్గత నిర్మాణం కారణంగా తమంతట తామే క్షీణించి, నశిస్తాయి. కానీ సింథటిక్‌ ప్లాస్టిక్స్‌లో ఇది సాధ్యం కాదు. పాలిమర్‌ను మడిచినట్లయితే, అవసరమైనపుడు వాటిలోని రసాయనిక బంధాలు విడిపోతాయా? అనే అంశంపై దృష్టి పెట్టారు. అణువు ముందుగానే అనుకూలమైన రూపాన్ని తీసుకునే విధానాన్ని ఉపయోగించారు. సరైన సమయం వచ్చినపుడు ఈ అణువుల మధ్య ఉండే బంధం విడిపోతుంది. ఫలితంగా ప్లాస్టిక్స్‌ నాశనమవుతాయి. దీనిని కాగితాన్ని ఓ ముడత వెంబడి మడత పెట్టడంగా అర్థం చేసుకోవచ్చు. దీనిని మడత పెట్టకపోతే, చీల్చడం సాధ్యం కాదు. పరిశోధకులు ప్లాస్టిక్‌లోకి ఇటువంటి ముడతలను చేర్చారు. చాలా ప్లాస్టిక్స్‌లో ఉండే సాధారణ రకం బంధాన్నే వీరు ఉపయోగించారు. నీరు లేదా ఇతర ప్రేరకాల ద్వారా ఈ బంధాలు విడిపోయి, ప్లాస్టిక్స్‌ నాశనమవుతాయి.

వేర్వేరు జీవిత కాలాలు
ఒకే మెటీరియల్‌కు వేర్వేరు జీవిత కాలాలు ఉండవచ్చు. అంటే, కొన్ని వారాల్లో లేదా కొన్ని నెలల్లో లేదా కొన్ని సంవత్సరాల్లో నాశనమయ్యే విధంగా వీటిని తయారు చేయవచ్చు. ఆహారం కోసం ఉపయోగించే గ్లాసులు, డబ్బాలు, ప్యాకేజింగ్‌ మెటీరియల్‌, ఒకసారి వాడి పారేసే వస్తువుల తయారీకి ఈ ప్లాస్టిక్స్‌ను వాడవచ్చు. అదే విధంగా ఎక్కువ కాలం నిలిచి ఉండే కార్ల విడి భాగాలు, భవన నిర్మాణ సామగ్రి వంటి వాటి కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇవి దశాబ్దాల పాటు నిలిచి ఉండే విధంగా డిజైన్‌ చేయవచ్చు. వీటి అవసరం ఇక లేదనుకున్నపుడు, వీటిని వాతావరణంలోకి పంపిస్తే, నెమ్మదిగా క్షీణిస్తాయి. వీటిని మార్కెట్‌లోకి తేవడానికి ముందు మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.