మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుకు చెందిన రాజకీయ పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
పార్లమెంటులో మొత్తం 93 స్థానాలు ఉండగా.. ముయిజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ) పార్టీ ఆదివారం అర్ధరాత్రి వరకు ఫలితాలు వెలువడిన 86 స్థానాల్లో 66 గెల్చుకుంది. అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన దాని కంటే ఎక్కువ మెజారిటీనే ముయిజ్జు పార్టీ కైవసం చేసుకుంది. ఈవివరాలను మాల్దీవుల ఎన్నికల కమిషన్ కూడా ధ్రువీకరించింది.
దీంతో పార్లమెంటుపైనా దేశాధ్యక్షుడు ముయిజ్జుకు పట్టు వచ్చినట్లయింది. అంతకుముందు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాల్దీవ్స్‌లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరిగింది. రాత్రికల్లా ఎన్నికల ఫలితం వచ్చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ)కి డజనుకు మించి సీట్లు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు.